కొనుగోలులో ఈ పాస్ విధానం
యూరియా పంపిణీ కోసం ప్రత్యేక యాప్
భూ రికార్డుల ఆధారంగా సరఫరా ● పక్కదారి పట్టకుండా ఉండేందుకే..
డీఏపీ, ఇతర కాంప్లెక్స్ ఎరువులు నార్మల్‌గా కొనవచ్చు ● మొదటి రోజు పనిచేయని యాప్‌తో ఇబ్బందులు
జహీరాబాద్: రైతులకు అవసరమైన యూరియా ఎరువులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. రైతులు ఇక నుంచి యాప్ ద్వారానే యూరియాను కొనుగోలు చేసుకోవచ్చు. ఇందు కోసం ఈ పాస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. రైతులు ఏదో ఒక పంట వేసుకుంటేనే ఆయా పంటకు అవసరాన్ని బట్టి యూరియాను పొందే అవకాశం ఉంటుంది. గతంలో మాదిరిగా ఎంత పడితే అంత యూరియాను తీసుకునే అవకాశం ఉండదు. రైతులు ఏయే పంటలను సాగు చేసుకున్నారు, ఆయా పంటలకు ఎంత మేర యూరియా అవసరం ఉంటుందనే దాని ఆధారంగానే రైతులకు యూరియా అందజేస్తారు. పంటల ఆధారంగా ఏయే పంటకు ఎంత యూరియా అవసరం ఉంటుందనేది శాస్త్రవేత్తల సూచనలు పరిగణలోకి తీసుకుని అంత మేర మాత్రమే సరఫరా చేసేందుకు నిబంధనలు తెచ్చారు. ఆయా జిల్లాలకు కేటాయించే యూరియా పక్కనే ఉన్న రాష్ట్రాలకు, పక్కనే ఉన్న జిల్లాలకు అక్రమంగా తరలుతోందని, దీంతో అవసరం ఉన్న రైతులకు అందకుండా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అవసరం కంటే ఎక్కువ ఉపయోగిస్తున్నారనే ఉద్దేశంతో కట్టడి చేస్తోంది. రైతులకు యాప్ ద్వారా యూరియాను పొందేందుకు వీలుగా వ్యవసాయ శాఖ కార్యాచరణ చేపట్టింది. డీఏపీ, ఇతర కాంప్లెక్స్ ఎరువులను మాత్రం గతంలో మాదిరిగానే కొనుగోలు చేసుకునే మినహాయింపు కల్పించారు.
పంటను బట్టి యూరియా సరఫరా
రైతులు వేసుకున్న పంటను బట్టి యూరియా ఎరువు సరఫరా చేస్తారు. యూరియా ఎక్కువగా కావాలనే ఉద్దేశంతో వేసిన పంటను కాకుండా మరో పంటను యాప్‌లో టిక్ చేస్తే పండించిన పంటను అమ్ముకునే సమయంలో ఇబ్బందులు ఏర్పడతాయి. చిన్న, సన్న కారు రైతులకు మాత్రం ఒకే విడతలో యూరియా అందించనుండగా, పెద్ద రైతులకు ఒకే సారి 20 నుంచి 30 బస్తాలు తీసుకెళితే ఇబ్బంది ఉంటుందని, వారికి రెండు లేదా మూడు విడతల్లో యూరియా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కౌలు రైతులు సైతం బుక్ చేసుకొని ఎరువు పొందే సౌలభ్యం కల్పించారు. ఆధార్, పట్టాదారు పాసుపుస్తకం ఎంట్రీ చేస్తే భూ యజమానికి ఓటీపీ వస్తుంది. దాన్ని కౌలురైతు తెలుసుకుని ఎంట్రీ చేయాలి. యూరియి ఎరువుల బుకింగ్‌లో వ్యవసాయ శాఖ అధికారులు, డీలర్లు కూడా బుక్ చేయాలనే ఆదేశాలు ఉన్నాయి.
పని చేయని యాప్‌తో ఇబ్బందులు
యూరియా ఎరువులు పొందేందుకు ప్రత్యేకంగా రూపొందించిన యాప్ పూర్తి స్థాయిలో ఇంకా పని చేయని పరిస్థితి ఏర్పడింది. సోమవారం నుంచి యాప్‌ను అమలులోకి తీసుకొచ్చారు. మొదటి రోజున జహీరాబాద్ ప్రాంతంలో యాప్ పని చేయక పోవడంతో రైతులు యూరియా పొందని పరిస్థితి ఏర్పడింది. వరి పంట ఉన్న ప్రాంతాల్లో మాత్రమే యాప్ పనిచేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెబుతున్నారు.
మొక్కజొన్న పంటకు యూరియా వేస్తున్న కూలీలు
ఇంటి వద్ద నుంచే
పొందే అవకాశం
ప్రత్యేక యాప్ తెచ్చినందున రైతులు తమకు అవసరమైన యూరియాను యాప్ ద్వారానే బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇంటి వద్ద నుంచే యూరియాను బుక్ చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి తెచ్చారు. సెల్ నంబర్, పట్టాదారు పాసుపుస్తకం ఉంటే సరిపోతుంది. అంతే కాకుండా యూరియా నిల్వలు ఏయే దుకాణంలో ఎంత మేర ఉన్నాయనేది దీని ద్వారా తెలుసుకునే వీలు కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిల్వలు కూడా చూసుకోవచ్చు. జిల్లాలో, మండలాల్లో, గ్రామాల్లోని ఫర్టిలైజర్స్ దుకాణాల్లో ఉన్న నిల్వలను ఇట్టే తెలుసుకోవచ్చు. రైతుల వద్ద స్మార్ట్ ఫోన్ లేకుంటే డీలర్ల వద్దకు వెళ్లి యాప్ ద్వారా బుక్ చేసుకుని, ఓటీపీ ద్వారా యూరియాను పొందవచ్చు.
కొనుగోలులో ఈ పాస్ విధానం


