డ్రైనేజీ సంపులోకి దిగి ఇద్దరు కార్మికులు మృతి
రామచంద్రాపురం(పటాన్‌చెరు): ఓ అపార్ట్‌మెంట్‌లో డ్రైనేజీ సంపు శుభ్రం చేయడానికి సంపులోకి దిగిన ఇద్దరు కార్మికులు ఊపిరాడక మృతి చెందారు. ఈ సంఘటన జీహెచ్‌ఎంసీ తెల్లాపూర్ పరిఽధి కొల్లూరులో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన హరీశ్ సింగ్(25) సుమిత్ రుయిదాస్(22) జీవనోపాధి కోసం తెల్లాపూర్‌కు వలస వచ్చారు. వీరు ఆర్‌ఆర్ ఇంజనీరింగ్ సంస్థలో కార్మికులుగా పని చేస్తున్నారు. కాగా కొల్లూరులోని బ్లాసమ్ హైట్స్ అపార్ట్‌మెంట్ సొసైటీ డ్రైనేజీ శుభ్రం చేసే పనులను ఆర్‌ఆర్ ఇంజనీరింగ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. అందులో భాగంగా సోమవారం రాత్రి సుమారు 11గంటల సమయలో హరీశ్‌సింగ్, సుమిత్ రుయిదాస్ కలసి డ్రైనేజీ సంపులోని నీటిని తొలగించే పనిని మొదలు పెట్టారు. నీటిని తొలగించిన తర్వాత సంపును శుభ్రం చేసేందుకు అర్థరాత్రి 12.30గంటల సమయంలో ఇద్దరు కలసి సంపులోకి దిగారు. వారు ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో అక్కడే ఉన్న సూపర్‌వైజర్ అతుల్ గట్టిగా కేకలు వేశాడు. దాంతో వెంటనే అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ సిబ్బంది వచ్చారు. వారి సహాయంతో అతుల్ నడుముకు తాడు కట్టుకొని సంపులోకి దిగే ప్రయత్నం చేశాడు. అతడు కూడా స్పృహ కోల్పోవడంతో వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అతని పైకి లాగారు. అగ్నిమాపక సిబ్బంది తాళ్ల సహాయంతో వారిద్దరిని బయటకు తీశారు. అప్పటికే వారు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. డ్రైనేజీ పనుల్లో భద్రతా నిబంధనలు ఉల్లంఘించారా..? అనే కోణంలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. కేసు దర్యాప్తులో ఉంది.
డ్రైనేజీ సంపులోకి దిగి ఇద్దరు కార్మికులు మృతి


