ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలి
ములుగు(గజ్వేల్): పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని, రాష్ట్ర అవసరాలు తీరుస్తూనే ఎగుమతులు పెంచుకోవాలని రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి సూచించారు. యువతను ఉద్యాన సాగువైపు మళ్లించేందుకు విశ్వవిద్యాలయంలో నైపుణ్యఅభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ములుగులోని కొండాలక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ 11వ వ్యవస్థాపక దినోత్సవం, జాతీయ రైతు దినోత్సవం పురష్కరించుకుని మంగళవారం నిర్వహించిన వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ప్రయోజనాల కోసం కొత్త విధానాన్ని రూపొందించాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలో ద్రాక్షసాగుకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొల్లాపూర్ మామిడి, బాలానగర్ సీతాఫలం పంటలకు విశిష్టత దృష్ట్యా వీటిపై పరిశోధనలను ముమ్మరం చేయాలని, వీటి ఎగుమతుల ద్వారా రైతులకు ఆదాయం పెంచాలన్నారు.
మహారాష్ట్రం తరహాలో..
మహారాష్ట్ర ప్రభుత్వం తరహా ఉద్యాన పాలసీలను ఇక్కడ కూడా అమలు చేయాలని సూచించారు. విత్తనాలు, డ్రిప్, స్ప్రింక్లర్లు తదితర వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఉద్యాన వర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ డాక్టర్ రాజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఉద్యాన రంగ అభివృద్ధిలో ములుగు విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రాష్ట్రంలో కూరగాయల సాగు 12 లక్షల ఎకరాలకు పైగా పెరగాలన్నారు. వర్సిటీ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. తదితర వాటిపై త్వరలోనే నూతన పరిశోధనలు ప్రారంభిస్తామన్నారు. డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్స్‌లర్ డా.ఎస్.డి. శికమణి ప్రసంగిస్తూ కృతిమ మేధస్సు, ఆధునిక సాంకేతికతలు ఉద్యానరంగ ఉత్పాదకత పెంపులో కీలకంగా మారుతున్నాయన్నారు. ఈ సందర్బంగా రైతులతో పరస్పర చర్చా కార్యక్రమం జరిగింది. కార్యక్రమం సందర్భంగా విశ్వవిద్యాలయ అభివృద్ధికి విశేష సేవలందించిన పలువురు బోధన, బోధనేతర సిబ్బందిని వైస్ ఛాన్స్‌లర్ దండ రాజిరెడ్డి అవార్డులతో సత్కరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ భగవాన్, మాజీ వీసీ నీరజ ప్రపభాకర్, డీన్‌లు చీనానాయక్, లక్ష్మీనారాయణ, సురేష్‌కుమార్, శ్రీనివాసన్, రాజశేఖర్, రైతులు పాల్గొన్నారు.
రాష్ట్ర అవసరాలు తీరుస్తూనే
ఎగుమతులు పెంచుకోవాలి
తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక మండలి
ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
ములుగు వర్సిటీలో వ్యవస్థాపక,
రైతు దినోత్సవం


