ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
నర్సాపూర్ రూరల్: ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై రంజిత్‌రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని పెద్దచింతకుంటకు చెందిన విఠల పుష్ప భాగయ్య దంపతుల రెండో కుమారుడు వేణు (24) కొంతకాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. 15 రోజులుగా ఒంటరిగా ఉంటూ మనోవేదన చెందుతున్నాడు. సోమవారం ఉదయం తాను ఉద్యోగం చేస్తున్న కంపెనీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి రాత్రి వరకు తిరిగిరాలేదు. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వారి వద్ద ఆరా తీశారు. అయినా జాడ తెలియరాలేదు. ఈక్రమంలో మంగళవారం గ్రామ సమీపంలోని ఓ చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అప్పుల బాధతో మహిళ ఆత్మహత్య
దుబ్బాకరూరల్: అప్పుల బాధ, అనారోగ్య సమస్యలతో ఓ మహిళ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని గంభీర్‌పూర్‌లో జరిగింది. ఎస్‌ఐ కీర్తి రాజ్ తెలిపిన వివరాల ప్రకారం..పెంబర్తి రాజవ్వ(59) బీడీలు చుడుతూ జీవనం సాగిస్తుంది. భర్త ఎల్లయ్య గొర్రెల కాపరి. వారికి నాలుగురు కుమార్తెలుండగా వారందరికీ వివాహాలు జరిపించారు. అయితే ఐదేళ్ల క్రితం చిన్న కూతురు వివాహాం కోసం చేసిన అప్పులు ఇంకా తీరలేదు, దీనికి తోడు అనారోగ్య సమస్యలు తోడయ్యాయి. ఈ క్రమంలో రాజవ్వ తీవ్ర మనస్థాపానికి గురై సోమవారం రాత్రి ఎవ్వరు లేని సమయంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకొన్న పోలీసులు అక్కడి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలు భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
చేగుంట(తూప్రాన్): కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని రెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ముప్పిడి స్వామి (43) లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కుమారుడు రాజు ఓ అమ్మాయితో ప్రేమ విషయమై ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపం చెందిన స్వామి మంగళవారం సబ్‌స్టేషన్ సమీపంలో చెట్టుకు ఉరేసుకొని మృతిచెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు.
అనారోగ్యంతో గృహిణి ఆత్మహత్య
దుబ్బాకరూరల్: తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఓ గృహిణి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని పెద్దగుండవెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కీర్తి రాజ్ తెలిపిన వివరాలు.. దొడ్ల లక్ష్మి(49) మూడేళ్ల నుంచి తీవ్రమైన నడుము నొప్పి, బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది మంగళవారం తెల్లవారుజామున ఇంటి ప్రక్కన ఉన్న మరో పాత ఇంటిలో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన భర్త పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతురాలు కుమార్తె భవాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


