నీళ్లు లేని బావిలో పడిన వృద్ధుడు
దుబ్బాకటౌన్: కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన వృద్ధుడు ప్రమాదవశాత్తు నీరు లేని బావిలో పడ్డారు. ఈ ఘటన దుబ్బాక మున్సిపల్ పరిధి చేర్వాపూర్ 6వ వార్డులో చోటుచేసుకుంది. స్థానికులు, దుబ్బాక ఎస్‌ఐ కీర్తిరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన ఆర్ల శివరాజయ్య అనే వృద్ధుడు వ్యక్తిగత పని నిమిత్తం సోమవారం దుబ్బాక ప్రాంతానికి వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున చేర్వాపూర్ శివారులో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వచ్చి, నీరు లేని పాడుబడిన బావిలో ప్రమాదవశాత్తు పడ్డాడు. బావిలోంచి అరుపులు విన్న అక్కడి స్థానిక రైతులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి నిచ్చెన, తాడు సహాయంతో బావిలోని వృద్ధుడిని జాగ్రత్తగా పైకి తీసుకువచ్చారు. అంబులెన్సులో దుబ్బాక వంద పడకల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వృద్ధుడి పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలించారు.
కాపాడిన అగ్నిమాపక, పోలీసు సిబ్బంది


