కెనాల్‌లో పడిన జింక
దుబ్బాకటౌన్: నీటి కోసం వచ్చి ప్రమాదవశాత్తు కెనాల్‌లో పడిన జింకను (సాంబార్ డీర్) అటవీశాఖ అధికారులు సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటన దౌల్తాబాద్ మండలం ఇందుప్రియల్ సమీపంలోని కెనాల్ లో చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల నిమిత్తం కెనాల్ మీదుగా వెళుతున్న రైతులు గమనించి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రైతులు ఇచ్చిన సమాచారంతో స్పందించిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎస్.కె హైమద్, బీట్ ఆఫీసర్‌లు వేణు జహంగీర్ కెనాల్ వద్దకు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. చర్యలు చేపట్టి జింకను సురక్షితంగా బయటకు తీసి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పరిసర గ్రామాల్లో జింకల సంచారం ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వన్యప్రాణులకు ఎలాంటి హాని కలగకుండా సహకరించాలని ప్రజలను, రైతులను కోరారు.
సురక్షితంగా బయటకు తీసిన అధికారులు


