ఈ పోస్టు భలే హాట్ గురూ..!
ఖాళీగా ఉన్న డీపీఓ పోస్టు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఖాళీ అయిన జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) పోస్టు కోసం కొందరు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యంగా నలుగురు అధికారుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ డీపీఓగా పనిచేసిన సాయిబాబపై ఇటీవల సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. ఒకవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జిల్లా అధికార వర్గాలతో పాటు, ఇటు రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఆయన స్థానంలో ప్రస్తుతం జిల్లా పరిషత్ సీఈఓ జానకిరెడ్డికి తాత్కాలిక బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ పోస్టు కోసం నలుగురు అధికారులు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
పోస్టు కోసం పోటా పోటీ
రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న ఓ డీఎల్‌పీఓ ఈ పోస్టు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధిని కలిసినట్లు అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మేరకు ఆ ప్రజాప్రతినిధి నుంచి లేఖ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నల్లగొడ, కరీంనగర్ జిల్లాల్లో పనిచేస్తున్న మరో ఇద్దరు డీఎల్‌పీఓలు కూడా ఈ పోస్టును ఆశిస్తున్నారు. అదేవిధంగా ఓ కేంద్ర మంత్రి వద్ద పని చేస్తున్న మరో అధికారి పేరు కూడా వినిపిస్తోంది. ఇలా ఈ డీపీఓ పోస్టు కోసం పోటాపోటీ నెలకొనడం ఆశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సంగారెడ్డి జిల్లా హైదరాబాద్‌కు సమీపంలో ఉంటుంది. హైదరాబాద్‌లో నివాసం ఉండే అధికారులు ఇక్కడ పనిచేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. మరోవైపు రియల్‌ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమలు, ఎక్కువగా ఉంటాయి. వీటి అనుమతుల మంజూరు, అక్రమ నిర్మాణాలు, కార్యదర్శుల పోస్టింగ్‌లు ఇలా ఇక్కడ పనిచేస్తే నాలుగు రాళ్లు వెనుకేసుకోవచ్చనే భావన చాలా మంది అధికారుల్లో ఉంటుంది. దీంతో ఈ పోస్టుకు భారీగా డిమాండ్ ఏర్పడింది.
నలుగురు అధికారుల తీవ్ర ప్రయత్నాలు
జిల్లాలో కీలక ప్రజాప్రతినిధిని కలిసిన ఓ అధికారి
కేంద్ర మంత్రి వద్ద పని చేస్తున్నమరో అధికారి కూడా..
నల్లగొండ, కరీంనగర్ నుంచి మరో ఇద్దరు యత్నం
హైదరాబాద్ దగ్గర ఉండడంతో విపరీతమైన డిమాండ్
పదోన్నతుల ప్రక్రియ
ముగిసిన వెంటనే..
గ్రామపంచాయతీల ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. దాదాపు రెండేళ్ల తర్వాత గ్రామపంచాయతీలకు పాలకవర్గాలు ఏర్పడ్డాయి. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారాలు కూడా పూర్తయ్యాయి. దీంతో రెండేళ్లుగా కుంటుపడిన గ్రామ పంచాయతీల పాలన ఇప్పుడు గాడిన పడనుంది. ఈ నేపథ్యంలో కీలకమైన జిల్లా పంచాయతీ అధికారి పోస్టును తక్షణం భర్తీ చేయడం అనివార్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే డీఎల్‌పీఓలను డీపీఓలుగా నియమించాలంటే పంచాయతీరాజ్ శాఖలో అధికారుల పదోన్నతులకు సంబంధించిన డీపీసీ ప్రక్రియ జరపాల్సి ఉంది. ఈ ప్రక్రియ త్వరలోనే పూర్తి చేశాక పోస్టింగ్ ఇస్తారా? ఈలోగానే ఈ పోస్టును భర్తీ చేస్తారా? అనే అంశంపై చర్చజరుగుతోంది.


