పల్లె పాలన మరింత చేరువ
● తిరిగి ఉమ్మడి రాష్ట్ర విధానం అమలు
● చర్యలు చేపట్టిన ప్రభుత్వం
● ఉమ్మడి జిల్లాలో 1,613 పంచాయతీలు
నారాయణఖేడ్: పల్లె పాలన ప్రజలకు మరింత చేరువ చేసేందకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2014లో ప్రత్యేక రాష్ట్రం అవతరించిన తర్వాత క్రమంగా నిర్వీర్యంగా మారి అనంతర కాలంలో అప్రకటితంగా రద్దయిన గ్రామ పంచాయతీ స్థాయీ సంఘాలు మళ్లీ కార్యరూపం దాల్చనున్నాయి. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న విధానాన్ని తిరిగి అమలులోకి తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కోసం గతంలో మాదిరిగా ప్రతీ గ్రామంలో నాలుగు సంఘాల చొప్పున ఏర్పాటు అవసరం అని భావిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 613, మెదక్ జిల్లాలో 492, సిద్దిపేట జిల్లాలో 508 చొప్పున మ్తొతం ఉమ్మడి జిల్లాలో 1,613 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామాభివృద్ధికి దోహద పడాలన్న లక్ష్యంతో ప్రతీ గ్రామ పంచాయతీకి నలుగురు చొప్పున ఏర్పాటు చేసిన స్థాయి సంఘాలు గడచిన పదేళ్ల కాలంలో కనుమరుగయ్యాయి. ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ, సంక్షేమం పథకాలు, కార్యక్రమాలు నిజమైన లబ్ధిదారులకు అందేలా చేయడం లాంటి బాధ్యతలతో గతంలో ఈ సంఘాలు ఏర్పాటయ్యాయి. స్థాయి సంఘాల జోక్యాన్ని, ప్రమేయాన్ని సర్పంచ్‌లతోపాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రాజకీయంగా వ్యతిరేకించడంతో అప్పట్లో అధికారులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం కూడా ఈ అంశంపై పెద్దగా దృష్టి కేంద్రీకరించక పోవడంతో పల్లెల అభివృద్ధికి సలహాలు, సూచనలు అందించేందుకు పంచాయతీల్లో ఏర్పాటు చేసిన స్థాయి సంఘాలు పత్తాలేకుండా పోయాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో, పంచాయతీ పాలకవర్గ సమావేశాల్లోనూ ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో పలు పంచాయతీల్లో స్థాయి సంఘ సభ్యులకు క్రమేనా గుర్తింపు లేకుండా పోయింది.
ప్రభుత్వం నిర్దేశంచిన మార్గదర్శకాల ప్రకారం పంచాయతీల్లో శానిటేషన్ స్థాయి సంఘం, వీధిలైట్ల స్థాయి సంఘం, పచ్చదనం పెంపొందించడం, మొక్కల పెంపకం అభివృద్ధి స్థాయి సంఘం, అభివృద్ధి పనుల స్థాయి సంఘాలను ప్రతీ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సంఘం సభ్యులు గ్రామాల్లో జరుగుతున్న పనులు, పరిస్థితులను పర్యవేక్షించడం, పాలక వర్గానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. పంచాయతీల్లో రూపొందించే అభివృద్ధి ప్రణాళికలో స్థాయి సంఘ సభ్యుల సిఫార్సులకు ప్రాధాన్యం కల్పించాల్సి ఉంటుంది. పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డు, శ్మశాన వాటికల నిర్వహణకు సలహాలు, సూచనలు, స్ట్రీట్‌లైట్స్ పరిశీలన, విద్యుత్ పొదు పునకు సహకరించడం, నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం, పచ్చదనం పెంపొందించడం, ప్రజా అవసరాల పనులు, వార సంతలకు సంబంధించిన పర్యవేక్షణలో స్థాయి సంఘాల సభ్యులు భాగస్వామ్యం కావాల్సి ఉంటుంది.


