తగ్గిన క్రైం రేటు
● ఎస్పీ పరితోష్ పంకజ్
● వార్షిక నివేదిక విడుదల
సంగారెడ్డి జోన్: ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కమ్యూనిటీ పోలీసింగ్, సోషల్ మీడియా ద్వారా విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో వార్షిక క్రైమ్ నివేదికను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సమాజంలో శాంతి, భద్రతలను నెలకొల్పడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సైబర్ నేరాలు, పోక్సో చట్టాలు, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. 2025 సంవత్సరంలో 8,255 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఒక శాతం తగ్గినట్లు తెలిపారు. హత్యలు 32 శాతం, ఆస్తి కోసం హత్యలు 19శాతం, అత్యాచార కేసులు 21 శాతం తగ్గగా, దొంగతనాల కేసులు 39శాతం పెరిగినట్లు వివరించారు. నార్కోటిక్ ఎనాలసిస్ బ్రాంచ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ సమన్వయంతో 43 ఎన్ డీపీఎస్ కేసులు నమోదు చేసి 786.63కిలోల గంజాయి, 1040 గ్రాముల అల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సైబర్ నేరాల ద్వారా కోల్పోయిన రూ. 34.64కోట్లలో రూ.7.03కోట్లు హోల్డ్ చేశామన్నారు. గత సంవత్సరం కంటే రోడ్డు ప్రమాదాలతో పాటు మరణాల శాతం సైతం తగ్గిందన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు, డీఎస్పీలు సత్తయ్య గౌడ్, ప్రభాకర్, సైదా నాయక్, వెంకట్ రెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


