నిమ్జ్‌కు భూములు ఇవ్వం
● తేల్చి చెప్పిన ఎల్గోయి రైతులు
● భూ సేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ
ఝరాసంగం(జహీరాబాద్): నిమ్జ్ ప్రాజెక్టు కొరకు మిగిలిన కొద్ది భూములు ఇచ్చే ప్రసక్తే లేదని ఎల్గోయి గ్రామ రైతులు తేల్చి చెప్పారు. మంగళవారం మండల పరిధిలోని ఎల్గోయి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో భూమిని సేకరించేందుకు రైతుల నుంచి అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. రెండో విడతలో 103 మంది రైతులకు సంబంధించిన 195 ఎకరాల భూమిని సేకరించేందుకు నిర్ణయించారు. నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్ విశాలాక్షి, తహసీల్దార్ తిరుమలరావు సేకరించే భూముల వివరాలను సర్పంచ్ లక్ష్మీబాయి అధ్యక్షతన గ్రామసభ ద్వారా చదివి వినిపించారు. దీంతో రైతులు మాట్లాడుతూ.. ఇప్పటికే తమ గ్రామంలో 1800 ఎకరాల భూమిని ప్రాజెక్టు కొరకు అప్పగించామన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు సైతం ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. అభివృద్ధి కొరకు ఉన్న భూములు తీసుకుంటే తమ పరిస్థితి ఏమిటని అధికారులకు ప్రశ్నించారు. ఎవరు వచ్చినా భూములు మాత్రం ఇచ్చేది లేదన్నారు. ఇదిలా ఉండగా ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు సంతకాలు పెట్టకుండానే గ్రామ సభ నుంచి వెళ్లిపోయారు. జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు ఆధ్వర్యంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.


