క్షమించే గుణం చాలా గొప్పది
● మంత్రి దామోదర రాజనర్సింహ
● జోగిపేటలో క్రిస్మస్ వేడుకలు
జోగిపేట(అందోల్): అంకిత భావంతో సమాజ సేవ చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి సి.దామోదర రాజనర్సింహ అన్నారు. మంగళవారం జోగిపేటలో క్రిస్మస్ వేడుకలను చిన్నారులతో కలిసి ఆయన కేక్ కట్ చేసి ప్రారంభించారు. చర్చి ఫాదర్ విజయ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ప్రతి మనిషిలో అన్ని గుణాలు ఉంటాయని, అందులో క్షమించే గుణం చాలా గొప్పదన్నారు. అన్ని మతాలు, విశ్వాసాలు వేరైనా గమ్యం మాత్రం ఒక్కటేనని సూచించారు. యేసు ప్రభువు ఈ లోకానికి మంచి మార్గాన్ని చూపించారని చెప్పారు. తాను 2004వ సంవత్సరంలోనే జెరూసలాం వెళ్లి వచ్చానని గుర్తుచేశారు. రెండు వేల సంవత్సరాల క్రితం ఒక అద్భుతం జరిగిందని, మానవాళి ఏ రకంగా జీవించాలన్న సూచనలు చేసిన వ్యక్తి యేసు ప్రభువు అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తుందన్నారు. క్రిస్మస్ పండగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆయన క్రైస్తవులకు ఆకాంక్షించారు. ఈ సందర్బంగా పలువురు మహిళలు కోలాటం ఆడి అలరించారు.
స్వయంగా వడ్డించిన మంత్రి
క్రిస్మస్ వేడుకలను హాజరైన క్రైస్తవ మహిళలు, పురుషులకు స్వయంగా మంత్రి దామోదర వడ్డించాడు. దీంతో వారంతా సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చర్చి ఫాదర్‌లతో కలిసి భోజనం చేసారు. కార్యక్రమంలో అందోలు, జోగిపేట ఆర్డీఓ పాండు, ఇన్‌చార్జి తహసీల్దార్ మధుకర్‌రెడ్డి, కమిషనర్ రవీందర్, పీసీసీ ఉపాధ్యక్షుడు సంగమేశ్వర్, మాజీ కౌన్సిలర్లు సురేందర్‌గౌడ్, ప్రవీణ్, ఆర్.సురేష్ పాల్గొన్నారు.


