మార్కెట్ ప్రకారమే పరిహారం ఇవ్వాలి
కంది(సంగారెడ్డి): ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ కోసం తమ నుంచి సేకరించనున్న అసైన్మెంట్ ల్యాండ్‌కు బదులు ప్రస్తుతం నడుస్తున్న మార్కెట్ రేటు ప్రకారం పరిహారం అందించాలని భూ బాధితులు అధికారులను కోరారు. మండల పరిధిలోని చేర్యాల గ్రామంలో గల సర్వే నం.741లోని 120 ఎకరాలను ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం సోమవారం ఆర్డీఓ రాజేందర్ ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా భూ బాధితులు మాట్లాడుతూ... ప్రభుత్వానికి భూమి ఇచ్చేందుకు తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రస్తుతం నడుస్తున్న మార్కెట్ రేటు కంటే అధికంగా చెల్లించాలని కోరారు. అలాగే ఇండస్ట్రియల్ పార్కులో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో భూములు కోల్పోయిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఈ అభిప్రాయాలపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపుతామని ఆర్డీఓ తెలియజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవికుమార్, సర్పంచ్ చేవెళ్ల రేఖారెడ్డి, ఆర్‌ఐ రంగయ్య పాల్గొన్నారు.


