చెక్ పవర్‌తోనే క్రేజ్..!
మహిళా సర్పంచ్‌ల స్థానాల్లోఆధిపత్యానికి యత్నం
సర్పంచ్‌లకు తలనొప్పిగాజాయింట్ చెక్‌పవర్
పంచాయతీ వ్యవస్థలో ఉప సర్పంచ్ పదవికి ప్రాధాన్యత
జోగిపేట(అందోల్): పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవితో పాటు ఉపసర్పంచ్ పదవికి కూడా పుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఒక సర్పంచ్ స్థానాన్ని మాత్రమే గెలుచుకోవడం వల్ల ప్రయోజనం లేదని, ఉపసర్పంచ్ స్థానాన్ని కూడా దక్కించుకుంటే గెలుపునకు పరిపూర్ణత సిద్ధిస్తుందని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. ఇందుకు ఉపసర్పంచ్ స్థానాలపై కూడా ప్రధానంగా గురిపెట్టాయి. దీనిని కై వసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపి దక్కించుకున్నాయి. సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచు కూడా కై వశం చేసుకోకపోతే పార్టీలు రాజకీయంగా ప్రతి కూలతలను ఎదుర్కోవలసి ఉంటుందని భావించి సర్పంచ్‌తోపాటు ఉపసర్పంచ్ పదవులను దక్కించుకున్నారు. కొన్ని చోట్ల సర్పంచ్ ఒక పార్టీ అయితే ఉప సర్పంచ్ పదవులు ప్రత్యర్థులకు దక్కాయి. ఉప సర్పంచ్ పదవికి కూడా అధికారాలు ఉండటం వల్లే ఆ పదవికి అంత ప్రాముఖ్యత ఉంది.
ఉప సర్పంచ్ అధికారాలు..
సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్‌కు కూడా విధులు, బాధ్యతలు ఉంటాయి. ఉపసర్పంచ్ గ్రామ పంచాయతీ సమావేశాల్లో పాల్గొనడం, సర్పంచ్ లేనప్పుడు ఆ విధులు నిర్వహిస్తాడు. పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా జరిగేట్టు చూడటం, రోడ్లు, మురుగు కాలువలు, వంతెనలు, బావుల నిర్మాణం, నిర్వహణ వంటి ప్రజాపనులు సక్రమంగా జరుగుతున్నాయో లేదో పర్యవేక్షిస్తాడు. గ్రామాల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయడం, వాటి నిర్వహణ బాధ్యతలను చూస్తాడు. గ్రామాల్లో ప్రాథమిక విద్యను అందించేందుకు, పంచాయతీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాడు.
మహిళా స్థానాల్లో ఆధిపత్యానికి..
50 శాతం సర్పంచ్ స్థానాలు మహిళలకు కేటాయించారు. మహిళా సర్పంచులు గెలిచిన పంచాయతీల్లో ఉపసర్పంచ్‌గా గెలుపొంది ఆధిపత్యం చెలాయించవచ్చనే ఉద్దేశంతో పలుకుబడి కలిగిన నేతలు వార్డు సభ్యులుగా బరిలోకి దిగారు. పాలకవర్గ సమావేశాలకు సర్పంచ్ గైర్హాజరైన సందర్భాల్లో ఉపసర్పంచ్ అధ్యక్షతనే నిర్వహిస్తారు. నిధుల వినియోగంలో సర్పంచ్‌తోపాటు ఉప సర్పంచ్‌కు చెక్ పవర్ ఉంటుంది. దీంతో మేజర్ పంచాయతీల్లో వార్డు సభ్యుల పదవులకు రూ.లక్షల్లో వెచ్చించేందుకు అభ్యర్థులు వెనుకాడని పరిస్థితి నెలకొంది. నిరక్ష్యరాస్యులైన మహిళలు పోటీ చేసే పంచాయతీల్లో ఉపసర్పంచ్‌కు మంచి డిమాండ్ ఉంది.
చెక్‌పవర్‌తోనే డిమాండ్
ఉపసర్పంచ్‌కు చెక్‌పవర్ ఉండటం ఈ పదవికి డిమాండ్‌ను పెంచింది. ఉప సర్పంచును ఎన్నుకునేది వార్డు సభ్యులే అవ్వడంతో వార్డు సభ్యుల పదవులకు పోటీ ఎక్కువగా ఉంటుంది. రాజకీయంగా పార్టీల నుంచి గట్టి మద్దతు ఉన్నవారు వార్డు పదవుల్లో సైతం గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కొన్ని చోట్ల మెజార్టీతో వార్డు సభ్యులు గెలవకపోయినా సర్పంచ్ ఓటుతో ఎన్నికయ్యారు. గ్రామ పంచాయతీల్లో చెక్‌పవర్ ముఖ్యమైనది.
చెక్ పవర్‌తోనే క్రేజ్..!


