బాక్సింగ్ టోర్నమెంట్ అబ్జర్వర్‌గా పీడీ నియామకం
కొండపాక(గజ్వేల్): మండలంలోని సిర్సనగండ్ల హైస్కూల్లో ఫిజికల్ డైరెక్టర్‌గా పని చేస్తున్న కడకంచి ఉప్పలయ్యను హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయి బాక్సింగ్ టోర్నమెంట్ ఎంపికల అబ్జర్వర్‌గా నియామకమయ్యారని ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో జరిగే టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు అండర్ 14 బాలుర విభాగం విద్యార్థుల ఎంపికలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా ఉప్పలయ్యను హెచ్‌ఎం పెద్ది విఠల్, ఉపాధ్యాయులు గురువారం అభినందించారు.
ట్రాక్టర్ అదుపు తప్పి
ఇద్దరికి గాయాలు
నిజాంపేట(మెదక్): మండల పరిధిలోని వెంకటాపూర్ (కె) శివారులోని పోచమ్మ వాగు వద్ద శుక్రవారం ట్రాక్టర్ అదుపు తప్పడంతో ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. కల్వకుంట నుంచి ధర్మారం వెళ్తున్న ఇటుకల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ అతివేగం కారణంగా అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళా కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు చేపట్టారు.
కొనుగోలు కేంద్రంలో ధాన్యం చోరీ
మద్దూరు(హుస్నాబాద్): కొనుగోలు కేంద్రంలో నిల్వ చేసిన ధాన్యం చోరీకి గురైన ఘటన దూల్మిట్ట మండలంలోని తోర్నాల గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు చొప్పరి యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు నిల్వ చేసుకున్న ధాన్యం నుంచి సుమారు 15 బస్తాల ధాన్యాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. అదేవిధంగా కేంద్రంలో వద్ద ఏర్పాటు చేసిన రెండు హైమాస్ట్ లైట్లు, అక్కడ ఏర్పాటు చేసిన చార్జింగ్ పెట్టే బోర్డులను ధ్వంసం చేసి వెళ్లినట్లు తెలిపారు. దీనిపై సెంటర్ నిర్వాహకుడు యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జ్యువెలరీ షాపులో చోరీ
జిన్నారం (పటాన్‌చెరు): నగలు కొనడానికి వచ్చి బంగారు గొలుసును అపహరించిన ఘటన బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లారం పట్టణ పరిధిలోని లక్ష్మీనగర్‌లోని శివం జ్యువెలరీస్ షాప్లో 14న గుర్తు తెలియని వ్యక్తి నగలు కొనేందుకు షాపులోకి వచ్చాడు. యజమాని హర్షిత్ సోనీ కొన్ని నగలను తీసి కౌంటర్ పైన ఉంచాడు. యజమాని గమనించకపోవడాన్ని చూసి నిందితుడు ఆరు గ్రాముల బంగారం గొలుసుతో పరారయ్యాడు. దీంతో బాధితుడు శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు. షాపులో ఉన్న సీసీ పుటేజీల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఆగి ఉన్న డీసీఎంను
ఢీకొట్టిన అంబులెన్స్
డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
సిద్దిపేటకమాన్: రోడ్డు పక్కన ఆగి ఉన్న డీసీఎంను ఓ ప్రైవేటు అంబులెన్స్ ఢీకొట్టిన ఘటన సిద్దిపేట పట్టణ శివారులో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం గోదావరిఖనికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో మృతి చెందాడు. అంబులెన్స్‌లో మృతదేహాన్ని గోదావరిఖనిలో అప్పగించి తిరిగి వస్తున్న క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున సిద్దిపేట పట్టణ శివారు రంగీలా దాబా చౌరస్తా వద్ద ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టింది. దీంతో అంబులెన్స్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన డ్రైవర్‌ను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
బాక్సింగ్ టోర్నమెంట్ అబ్జర్వర్‌గా పీడీ నియామకం
బాక్సింగ్ టోర్నమెంట్ అబ్జర్వర్‌గా పీడీ నియామకం


