క్యాన్సర్ వచ్చిందన్న మనస్తాపంతో..
చెరువులో దూకి మహిళ ఆత్మహత్య
హవేళిఘణాపూర్(మెదక్): క్యాన్సర్ వ్యాధి వచ్చిందని, తాను ఇక బతకనని మనస్తాపానికి గురైన మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కూచన్‌పల్లి గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన చాకలి సంపూర్ణ(40) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. దీంతో కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించగా క్యాన్సర్ వచ్చిందని, ఆపరేషన్ చేయించాలని వైద్యులు సూచించారు. దీంతో మరుసటి రోజు వెళ్లి ఆపరేషన్ చేయించుకుందామని అనుకున్నారు. ఈ క్రమంలో క్యాన్సర్ వచ్చిందని, ఇక తాను బతకనని మనస్తాపానికి గురై సంపూర్ణ అర్ధరాత్రి బహిర్భూమికి వెళ్తానని చెప్పింది. గ్రామ శివారులో ఉన్న పోతకుంటలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు వెతకగా శుక్రవారం తెల్లవారుజామున కుంటలో శవమై తేలినట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఏఎస్‌ఐ రాజు సందర్శించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతునికి భర్త శ్రీనివాస్, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.


