ఖర్చు లెక్కలు చూపండి
● 45 రోజుల్లోగా వివరాలు సమర్పించాలి
● లేకుంటే పదవికి గండమే
● మూడేళ్ల పాటు పోటీకి అనర్హత కూడా..
నారాయణఖేడ్: గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు పదవులకు పోటీ చేసిన అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చు లెక్కలు 45 రోజుల్లోగా సమర్పించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. లేకుంటే తమ పదవులు కోల్పోతారని పేర్కొంది. లెక్కలు చూపని వారికి మూడేళ్లపాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రతి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన తేదీ నుంచి ఫలితాల ప్రకటన వరకు ఎన్నికల కోసం చేసిన అన్ని ఖర్చులను ప్రత్యేక బ్యాంకు ఖాతాలో చూపించి సమర్పించాల్సి ఉంటుంది. మొదటి విడతలో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు జనవరి 24లోపు, రెండో విడతలో పోటీ చేసిన అభ్యర్థులు జనవరి 27, మూడో విడతలో పోటీ చేసిన వారు జనవరి 30లోపు ఎంపీడీఓలకు ఖర్చుల వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది.
తప్పుడు సమాచారం ఇచ్చినా చర్యలు
ఎన్నికల్లో చేసిన ఖర్చు నిర్ణీత గడువులోగా సమర్పించకున్నా, తప్పుడు సమాచారం ఇచ్చినా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 23 ప్రకారం చర్యలు తీసుకుంటామని, గెలిచిన అభ్యర్థులు పదవులు కోల్పోవాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం హెచ్చరించింది. అభ్యర్థులు సమర్పించిన వివరాలను ఎంపీడీవో లు పరిశీలించి టీఈపోల్ వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని, ఫిబ్రవరి 15లోపు ఎస్‌ఈసీకి పంపాలని సూచించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లోని సర్పంచ్ అభ్యర్థులు గరిష్టంగా రూ.1,50 లక్షలు, వార్డు అభ్యర్థి రూ. 30వేల వరకు, 5వేలకు పై జనాభా పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి గరిష్టంగా రూ.2.50లక్షలు, వార్డు అభ్యర్థి రూ.50వేల ఖర్చు చేయాలని నిర్ణయించింది.


