‘పల్లె’పోరులో హస్తానిదే పైచేయి
● హోరాహోరీగా పోరాడిన బీఆర్‌ఎస్ మద్దతుదారులు ● మూడు విడతల్లోనూ అధికార పార్టీకే అత్యధిక సర్పంచ్ స్థానాలు ● స్వల్ప మెజారిటీలతో చాలా స్థానాలను చేజార్చుకున్న బీఆర్‌ఎస్ ● నామమాత్రంగా 13 సర్పంచ్ స్థానాలకే పరిమితమైన బీజేపీ ● 35 స్థానాల్లో స్వతంత్రులు పాగా.. ముగిసిన పల్లెపోరు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పల్లె పోరులో అధికార కాంగ్రెస్ పార్టీనే పైచేయి సాధించింది. తొలి, రెండో విడతతో పాటు, బుధవారం జరిగిన మూడో విడతలోనూ ఆ పార్టీ మద్దతుదారులే అత్యధిక సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకున్నారు. జిల్లాలో మొత్తం 613 సర్పంచ్ స్థానాలుండగా, ఏకగ్రీవాలతో కలిపి మొత్తం 375 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ విజయం సాధించింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ ఈ పంచాయతీ ఎన్నికల్లో హోరాహోరీగా పోరాడింది. 190 సర్పంచ్ స్థానాలను గెలుచుకుని గ్రామాల్లో తనకున్న పట్టు నిలుపుకొంది. బీఆర్‌ఎస్ మద్దతుదారులు చాలా చోట్ల 10, 20 ఓట్ల అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ.. ఇప్పుడు నామమాత్ర సర్పంచ్ స్థానాలకే పరిమితమైంది. మూడు విడతల్లో కలిపి కేవలం 13 సర్పంచ్ స్థానాలతో ఆ పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
మూడో విడతలోనూ హస్తానిదే జోరు
మూడో విడతలోనూ అధికార పార్టీ జోరు కొనసాగింది. మొత్తం 234 గ్రామ పంచాయతీలుండగా, 27 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 207 గ్రామపంచాయతీల్లో బుధవారం పోలింగ్ జరిగింది. ఏకగ్రీవమైన 27 సర్పంచ్ స్థానాల్లో 26 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే ఉన్నారు. బుధవారం పోలింగ్ జరిగిన 207 సర్పంచ్ స్థానాల్లో 131 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకున్నారు. ఈ విడతలో ఒక్క న్యాల్‌కల్ మండలం మినహా మిగిలిన ఏడు మండలాలు నారాయణఖేడ్ నియోజకవర్గంలోనివే. ఇక్కడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పి.సంజీవరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే ఎంపీ షెట్కార్ స్వస్థలం కూడా ఇదే ప్రాంతం కావడంతో కాంగ్రెస్ తన హవాను కొనసాగించగలిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గట్టి పోటీ ఇచ్చిన బీఆర్‌ఎస్
ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ మద్దతుదారులు గట్టి పోటీని చ్చారు. పోలింగ్ జరిగిన 207 గ్రామాల్లో 64 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలను ఈ పార్టీ మద్దతుదారులు గెలుచుకొన్నారు. పది, ఇరవై ఓట్ల స్వల్ప తేడాతో బీఆర్‌ఎస్ మద్దతుదారులు ఓటమి పాలయ్యారు.
వికసించని కమలం
మూడో విడతలోనూ బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. తొలి, రెండో విడత మాదిరిగానే మూడో విడతలోనూ ఆ పార్టీ మద్దతుదారులు కేవలం ఏడు సర్పంచ్ స్థానాలతో సరిపెట్టుకున్నారు. ఈ పల్లె సంగ్రామంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు కమలం పార్టీ మద్దతుదారులు ఏమాత్రం పోటీ ఇవ్వలేక పోయారు. స్వతంత్రులు 35 సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించారు. ఆయా గ్రామాల్లో తమకు ఉన్న వ్యక్తిగత ప్రతిష్టతో వీరు గెలుపొందారు. ప్రధాన పార్టీల మద్దతుదారులను కాదని వీరిని ఆయా గ్రామాల ప్రజలు గెలిపించడం గమనార్హం.
సర్పంచులుగా గెలిచిన పార్టీల మద్దతుదారులు..(ఏకగ్రీవంతో కలిపి..)
మండలం మొత్తం జీపీలు కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ స్వతంత్రులు
కల్హేర్ 15 07 05 01 02
కంగ్టి 33 19 12 01 01
మానూర్ 22 13 08 –– 01
నాగల్‌గిద్ద 33 24 08 01 ––
నారాయణఖేడ్ 47 38 08 01 ––
నిజాంపేట 18 13 03 01 01
సిర్గాపూర్ 28 18 08 02 ––
న్యాల్‌కల్ 38 25 12 –– 01
మొత్తం 234 157 64 07 06
మూడు విడతల్లో ఇలా.. పార్టీల వారీగా సర్పంచ్ స్థానాలు (ఏకగ్రీవాలతో కలిపి..)
విడత మొత్తం జీపీలు కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ స్వతంత్రులు
తొలి విడత 136 71 46 04 15
రెండో విడత 243 147 80 02 14
మూడో విడత 234 157 64 07 06
మొత్తం 613 375 190 13 35
‘పల్లె’పోరులో హస్తానిదే పైచేయి


