అనుక్షణం.. అప్రమత్తం
స్తంభించిన ట్రాఫిక్
కిటకిటలాడిన హోటళ్లు
వెబ్ కాస్టింగ్ ద్వారా ఎస్పీ పరిశీలన
సంగారెడ్డి జోన్: జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బుధవారం జరిగిన పోలింగ్ సరళిని ఎస్పీ పరితోష్ పంకజ్ తన కార్యాలయం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అదనపు బలగాలు ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు పోలింగ్ ప్రక్రియ పరిశీలించేందుకు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. వలస ఓటర్లు ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు నారాయణఖేడ్ ప్రాంతానికి వెళ్తున్న క్రమంలో ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసు అధికారులు వాహనాలు సాఫీగా రాకపోకలు సాగించే విధంగా చేశారు.
నారాయణఖేడ్: ఎస్పీ పరితోష్ పంకజ్ బుధవారం నారాయణఖేడ్ మండలం తుర్కాపల్లి, నిజాంపేటలలో పోలింగ్ కేంద్రాలను సందర్శించి, ఎన్నికలు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు వివరాలు తెలుసుకోవడమే కాకుండా ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
ఓటు చోరీపై నిరసన
నారాయణఖేడ్: తన ఓటును ఇతరులు ముందే వేశారంటూ నారాయణఖేడ్ మండలం తుర్కాపల్లికి చెందిన యాస్మిన్ ఆందోళన వ్యక్తం చేశారు. యాస్మిన్ కుటుంబ సభ్యులు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లి బుధవారం స్వగ్రామంలో ఓటు హక్కును వినియోగించుకొనేందుకు తుర్కాపల్లికి వచ్చారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లి తన ఓటరు స్లిప్ చూపించడంతో, పోలింగ్ అధికారులు అప్పటికే ఆమె ఓటును వేశారంటూ తెలుపడంతో అసహనానికి గురయ్యారు. తన ఓటును ఇతరులు వేయడంపై విచారణ జరపాలంటూ ఆమె పోలింగ్ కేంద్రం ఎదుట ఓటరు స్లిప్‌తో నిరసన తెలిపారు.
వలస ఓటర్ల తాకిడి
నారాయణఖేడ్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో సొంత గ్రామాల్లో ఓటు హక్కును వినియోగించుకొనేందుకు వలస వెళ్లిన వారు నారాయణఖేడ్ ప్రాంతంలోని గ్రామాలకు భారీగా తరలి వచ్చారు. బుధవారం తెల్లవారు జాము నుంచే వలస వెళ్లిన ఓటర్లు ప్రత్యేక వాహనాలు, కార్లు, ఆటోలలో తరలి రావడంతో ఈ ప్రాంత రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయం సమీపంలో జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతుండడంతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ఎస్పీ పరితోష్ పంకజ్ స్వయంగా ట్రాఫిక్‌ను క్లియర్ చేయించారు. వలస ఓటర్లు భారీగా తరలి రావడంతో నారాయణఖేడ్‌లో హోటళ్లు, టీ కొట్లు జనాలతో కిటకిటలాడాయి. హోటళ్లలో పదార్థాలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. కొందరు చట్నీ, సాంబార్ లేకపోయిన టిఫిన్ తినడం కనిపించింది. ఎన్నికల సందర్భంగా కొన్ని హోటళ్ల వారు స్వగ్రామాలకు వెళ్లడంతో మూసి వేయడం వల్ల ఉన్న హోటళ్లలో విపరీతమైన గిరాకీ ఏర్పడింది.
ఫలితం స్వరూపం మార్చిన రెండు ఓట్లు
నారాయణఖేడ్: ఎన్నికల్లో ఒక్కో ఓటు కూడా అమూల్యమనే విషయం నారాయణఖేడ్ మండలం కొండాపూర్‌లో నిజం చేసింది. కొండాపూర్ హనుమాన్ తండా సర్పంచ్‌గా నేనావత్ స్వరూప రెండు ఓట్ల ఆధిక్యతతో సర్పంచ్ పదవిని దక్కించుకుంది. తండాలో 400 ఓట్లు ఉంటే 352 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన స్వరూపకు 136, బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన బూరీబాయికి 134 ఓట్లు దక్కాయి. మరో స్వతంత్ర అభ్యర్థి భారతికి 81ఓట్లు రాగా , నోటాకు 1 ఓటు పోలైంది. బూరీబాయిపై రెండు ఓట్ల ఆధిక్యతతో స్వరూప విజయం సాధించింది.
న్యాల్‌కల్‌లో కాంగ్రెస్ హవా
న్యాల్‌కల్(జహీరాబాద్): మండలంలో బుధవారం జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు అధిక స్థానాలను కై వసం చేసుకున్నారు. 38 పంచాయతీల్లో రుక్మాపూర్, మెరియంపూర్, చీకూర్తి ఏకగ్రీవమవగా.. 35 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. అందులో కాంగ్రెస్ మద్దతుదారులు 22, బీఆర్‌ఎస్ 11 స్థానాలను కై వసం చేసుకోగా, రెండు స్థానాలను స్వతంత్రులు కైవసం చేసుకున్నారు. గెలుపొందిన అభ్యర్థులతో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు.
అనుక్షణం.. అప్రమత్తం
అనుక్షణం.. అప్రమత్తం
అనుక్షణం.. అప్రమత్తం


