ఓటెత్తిన పల్లెజనం
87.43 శాతం నమోదు తరలివచ్చిన వలస ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్న గ్రామీణ ఓటర్లు ముగిసిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గ్రామీణ ఓటర్లలో మరోమారు చైతన్యం వెల్లు విరిసింది. బుధవారం జరిగిన మూడో విడత పంచాయతీ పోలింగ్‌లో పల్లె ఓటర్లు మరోసారి ఉత్సాహంగా ఓట్లేశారు. పెద్ద ఎత్తున ఓటింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ విడతలో 87.43 శాతం పోలింగ్ నమోదైంది. ఏడు డిగ్రీల చలిని సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి క్యూలైన్లలో నిలబడ్డారు. వృద్ధులు, వికలాంగులు సైతం ఉత్సాహంగా ఓట్లేశారు. మహిళలు బారులు తీరారు.
207 సర్పంచ్ స్థానాలకు పోలింగ్
జిల్లాలోని ఎనిమిది మండలాలు కల్హేర్, కంగ్టి, మనూర్, నాగల్‌గిద్ద, నారాయణఖేడ్, నిజాంపేట, సిర్గాపూర్, న్యాల్‌కల్ మండలాల్లో ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 234 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 27 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా, బుధవారం 207 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరిగింది. 576 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం 1,960 వార్డుల్లో 423 వార్డులు ఏకగ్రీవాలు పోగా, మిగిలిన 1,537 వార్డులకు పోలింగ్ జరిగింది. 3,519 మంది అభ్యర్థులు ఈ వార్డు సభ్యుల పదవులకు పోటీ చేశారు.
వెంటనే కౌంటింగ్.. ఫలితాల ప్రకటన
మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా వార్డు సభ్యులు, తర్వాత సర్పంచ్‌ల ఫలితాలను ప్రకటించారు. 351 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించారు. కలెక్టర్ ప్రావీణ్య పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎస్పీ పరితో ష్ పంకజ్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.
తుది విడతల్లోనూ భారీ పోలింగ్
ముగిసిన పల్లె సంగ్రామం
గ్రామీణ సంగ్రామం ముగిసింది. నెల రోజుల పాటు కొనసాగిన ఈ ఎన్నికల ప్రక్రియ బుధవారంతో పరిసమాప్తం అయింది. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అభ్యర్థులు కూడా హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. అనేక చోట్ల పెద్ద ఎత్తున మద్యం, నజరానాలు పంపిణీ చేశారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. సహకరించిన వారందరికి కలెక్టర్ పి.ప్రావీణ్య ధన్యవాదాలు తెలిపారు.


