సామర్థ్యాలకు అనుగుణంగా విద్యాబోధన: డీఈఓ
వట్‌పల్లి(అందోల్): విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. బుధ వారం అందోల్ మండల పరిధిలోని కన్‌సాన్‌పల్లి ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. ప్రాథమిక పాఠశాలకు చెందిన 3వ తరగతి విద్యార్థులకు ఆయా సబ్జెట్‌లపై పలు ప్రశ్నలు వేసి విద్యాసామర్థ్యాలను రాబట్టే ప్రయత్నం చేశారు. తెలుగు బోధన సరిగా జరగకపోవడంపై సదరు ఉపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లైబ్రరీ, టీచింగ్ డైరీలను పరిశీలించి నిర్వహణ సరిగ్గా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అనంతంరం జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు. ఖాన్ అకాడమీ తరగతులపై ఆరా తీశారు. విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మరుగుదొడ్లు, టాయిలెట్లు శిథిలావస్థకు చేరుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు, ఉపాద్యాయులు డీఈఓకు దృష్టికి తీసుకొచ్చారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను సత్వరమే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.


