
రోడ్లపైనే వడ్లు
కనిపించని కల్లాలు..
రోడ్లపైనే ధాన్యం ఆరబోస్తున్న రైతులు
● కల్లాల కొరతతో నానా అవస్థలు
● వాహదారులకు తప్పని ఇబ్బందులు
● నిత్యం ఏదో ఒకచోట ప్రమాదం
● పట్టించుకోని అధికారులు
చిన్నకోడూరు(సిద్దిపేట): మండలంలోని పలు గ్రామాల్లో రోడ్లపై పోసిన పంట కుప్పలతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. పంటను ఆరబెట్టుకునేందుకు కల్లాలు లేకపోవడంతో రైతులు తారు రోడ్లను ఆశ్రయిస్తున్నారు. చేతికొచ్చిన పంట దిగుబడుల్లో తేమ శాతం తగ్గించుకునేందుకు రోడ్లపై ధాన్యం ఆరబెడుతున్నారు. ధాన్యం కుప్పలు రోజుల తరబడి ఉండటంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి.
వాహనదారులకు ముప్పు..
యేటా సీజన్ రాగానే రైతులు రోడ్లపై ఇరువైపులా పంట కుప్పలు పోయడంతో రహదారులు కల్లాలుగా మారాయి. రోడ్లపై ధాన్యం ఆరబోయడంతో రాత్రి పూట వాహనదారులు అదుపుతప్పి కింద పడుతున్నారు. నిత్యం పలువురు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. కానీ కల్లాలు లేకనే రోడ్లపై పంటను ఆరబెట్టాల్సి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు.
కలగానే కల్లాలు..
గతంలో ఉపాధి హామీ పథకంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం, బీసీలకు 90 శాతం సబ్సిడీపై కల్లాల నిర్మాణానికి దరఖాస్తులను స్వీకరించింది. కొన్ని గ్రామాల్లో పూర్తయినా బిల్లులు రాలేదని, కొన్ని అసంపూర్తిగానే మిగిలిపోయాయని రైతులు వాపోతున్నారు. గత మూడేళ్లుగా కల్లాల పథకం నిలిచిపోవడంతో అర్హులైన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు రైతుల కష్టాలు గుర్తించి పథకాన్ని పునరుద్ధరిస్తే మేలు జరిగే అవకాశం ఉంటుందని రైతులు భావిస్తున్నారు.
రోడ్లపై ధాన్యాన్ని ఆరబెట్టొద్దు
దుబ్బాక : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతులు రోడ్లపై పోయకుండా కల్లాల్లో ఆరబెట్టుకోవాలని దుబ్బాక సీఐ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం సర్కిల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ధాన్యాన్ని రోడ్లపై పోయడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఇప్పటికే రోడ్లపై పోసిన ధాన్యం కుప్పలను వాహనాలు ఢీ కొట్టి మృతి చెందిన ఘటనలు చాలా ఉన్నాయన్నారు. రోడ్లపై ధాన్యం పోసి రైతులు ప్రమాదాలకు కారణం కావొద్దన్నారు. ఇప్పటికే రోడ్లపై ధాన్యం ఆరబెట్టవద్దంటూ రైతులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. రోడ్లపై ధాన్యం పోస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీనికి రైతులు సహకరించాలని సీఐ కోరారు.
–సీఐ శ్రీనివాస్

రోడ్లపైనే వడ్లు

రోడ్లపైనే వడ్లు