
తాళం వేసిన ఇంట్లో చోరీ
హుస్నాబాద్: పట్టణంలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హుస్నాబాద్ పట్టణంలోని ఎల్‌ఐసీ కాలనీకి చెందిన వెంకటస్వామి తన ఇంటికి తాళం వేసి పనుల నిమిత్తం ఊరికి వెళ్లాడు. గురువారం ఉదయం ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. బుధవారం రాత్రి ఇంట్లో ఉన్న 8 గ్రాముల బంగారం, 10 తులాల వెండి, కొంత నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులకు సమాచారం అందించగా క్లూస్ టీమ్ సభ్యులు వచ్చి వేలిముద్రలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువతి అదృశ్యం
నర్సాపూర్ రూరల్: యువతి అదృశ్యమైన ఘటన నర్సాపూర్ మండలం లింగాపూర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై లింగం వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కంచర్ల నారాయణ కూతురు కంచర్ల కృష్ణవేణి (19)ఈనెల 23న తల్లి చంద్రకళతో కలిసి నర్సాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉన్న బంధువులను పరామర్శించేందుకు వచ్చారు. తల్లి ఆస్పత్రి లోపల బంధువులను పరామర్శిస్తుండగా కృష్ణవేణి బయటకు వచ్చి కనపడకుండా పోయింది. చుట్టుపక్కల తల్లి, బంధువులు వెతికినా కనిపించలేదు. గురువారం తండ్రి నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.