
ఇక్కడ ప్రారంభ వేతనాలు ఎక్కువ.. నివాస వ్యయం తక్కువ
ఢిల్లీ, ముంబై, పుణె, బెంగళూరు నగరాల్లో ఆరంభ వేతనాలు తక్కువ
నివాస వ్యయం చాలా ఎక్కువ
ఇండీడ్ ‘పే మాప్’ సర్వేలో వెల్లడి
ఉద్యోగార్థులను ఆకర్షించడంలో దక్షిణాది నగరాలైన చెన్నై, హైదరాబాద్ ముందంజలో ఉన్నాయి. ఇక్కడ అవకాశాలు ఎక్కువగా లభిస్తుండటం, ప్రారంభ వేతనాలు మెరుగ్గా ఉండటం, నివాస వ్యయం తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణాలు. ఈ విషయాన్ని ఇండీడ్ సంస్థ తాజాగా విడుదల చేసిన ‘పే మాప్’ సర్వే నివేదికలో వెల్లడించింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారి ఆలోచనల్లో చాలా మార్పులు వస్తున్నాయని, అధిక నివాస వ్యయం ఉన్న సిటీల కంటే, తక్కువ ఖర్చు అయ్యే నగరాల్లోనే పనిచేయడానికి మొగ్గు చూపుతున్నారని తెలిపింది.
ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణె వంటి నగరాలు కంటే హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్ వంటి నగరాల్లో పనిచేయడానికి కొత్తవారు ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడించింది. అత్యధిక ఉద్యోగాలు అందిస్తున్న రంగంలో ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలే ముందంజలో ఉన్నాయని పేర్కొంది. ఆ తర్వాత తయారీ, టెలికాం రంగాలు ఉన్నాయని వివరించింది. గతేడాదితో పోలిస్తే కొత్తగా ఉద్యోగంలో చేరే వారి జీతాలు 15 శాతం పెరిగినట్లు తెలిపింది.
ఢిల్లీలో అత్యధిక వ్యయం
⇒ ఐటీ, తయారీ, టెలికాం రంగాల్లో కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి సగటున రూ.26,300 నుంచి రూ.30,100 వరకు ప్రారంభ వేతనాలు లభిస్తున్నాయి.
⇒ హైదరాబాద్‌లో ప్రారంభ వేతనం రూ.28,500 ఉండగా, రూ.30,100తో చెన్నై మొదటి స్థానంలో నిలిచింది.
⇒రెండేళ్లు అనుభవం దాటిన వారి జీతాల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉంది. 2 నుంచి 5 ఏళ్ల అనుభవం ఉన్నవారికి హైదరాబాద్‌లో సగటున నెలకు రూ.47,200 జీతం వస్తుండగా, ఐదేళ్లు దాటిన వారికి రూ.69,700 వరకు లభిస్తోంది.
⇒ మెట్రో సిటీల్లో పెరుగుతున్న ఖర్చులకు, జీతాలకు పొంతన కుదరడం లేదని 69 శాతానికి పైగా ఉద్యోగులు అభిప్రాయపడ్డారు.
⇒ ఢిల్లీలో నివాస వ్యయం చాలా ఎక్కువని 96 శాతం మంది తెలియజేశారు. ఆ తర్వాత స్థానాల్లో ముంబై (95శాతం), పుణె (94శాతం), బెంగళూరు (93శాతం) ఉన్నాయి.
⇒ చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతా నగరాల్లో నివాస వ్యయం మధ్య తరగతి వారికి అనుగుణంగా ఉందని అధిక శాతం ఉద్యోగులు చెప్పడం విశేషం.