వికారాబాద్: ఉడా (వికారాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ ఆథారిటీ) పేరుకే పరిమితమైంది. గతేడాది ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక మండలిని ఏర్పాటు చేసింది. 190 జీఓ విడుదల చేసి చేతులు దులుపుకొంది. ఉడాతో జిల్లాను సమగ్రాభివృద్ధి దిశగా నడిపిస్తామన్న అధికార పార్టీ నేతల మాటలు నీటిమీద రాతలయ్యాయని పలువురు ఆరోపిస్తున్నారు. కొడంగల్ డెవలప్‌మెంట్ అథారిటీ(కడా) అభివృద్ధిలో దూసుకుపోతుండగా ఉడా మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. గతంలో ఏడు జిల్లాలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో హెచ్‌ఎండీఏ 11 జిల్లాలకు విస్తరించింది. ఇందులో వికారాబాద్ జిల్లా పరిధిలోని పలు మండలాలు కూడా కలిశాయి. హెచ్‌ఎండీఓ పరిధిలోకి వెళ్లడంతో పాటు, ఆడా ఏర్పాటుతో సమీప భవిష్యత్‌లో జిల్లా రూపురేఖలు మారుతాయని అందరూ భావించారు. కానీ ఆ దిశగా అడుగులు మాత్రం పడలేదు.
ప్రకటనలతో సరి
ట్రిపుల్ ఆర్‌కు ఐదు కిలో మీటర్ల అవతలి వరకు హెచ్‌ఎండీఏ పరిధి విస్తరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ పరిధిలోకి మన జిల్లా కూడా వచ్చేసింది. రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న వికారాబాద్ అభివృద్ధిలో మాత్రం అట్టడుగున నిలిచిపోయింది. నగరానికి రెండు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లాలతో కూడా వికారాబాద్ పోటీ పడలేని స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి సీఎం, స్పీకర్ ప్రాతినిథ్యం వహిస్తుండటం అన్ని విధాలా కలిసొస్తుందని ప్రజలు భావించారు. తొలుత కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడంతో జిల్లాలోని ఇతర ప్రాంతాల ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అభివృద్ధి సీఎం సొంత నియోజకవర్గానికే పరిమితం చేస్తారా..? అనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక జీఓ 190 విడుదల చేసింది. ఉడా పేరుతో జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత ఎలాంటి చర్యలు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ట్రిపుల్ ఆర్, ఉడా, సెమీ అర్బన్ అలా అన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి.
ఏడాదిన్నర క్రితం జీఓ
ఉడా పేరిట ప్రభుత్వం గతేడాది మార్చిలో జీఓ జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు నిధులు మాత్రం విడుదల కాలేదు. కొడంగల్ నియోజకవర్గంలో మాత్రం సుమారు రూ.20వేల కోట్ల అంచనా వ్యయంతో పలు పనులు శరవేగంగా సాగుతున్నాయి. కొడంగల్ తరహాలోనే ఉడాను కూడా అభివృద్ధి చేయాలనే పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఉడా పరిధిలోకి వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీలు వీటి పరిధిలోని 493 రెవెన్యూ గ్రామాలు వస్తాయి. హెచ్‌ఎండీఏ పరిధిలోకి ఐదు మండలాల పరిధిలోని 50నుంచి 60 గ్రామాలు విలీనం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో శాటిలైట్ టౌన్‌షిప్‌ల డెవలప్‌మెంట్ కీలకం కానుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే పలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తూ వస్తోంది. మన జిల్లా హైదరాబాద్‌కు దగ్గరలో ఉండటంతో పాటు ఎన్నో వనరులు ఉండటంతో ప్రభుత్వం ఉడా ఏర్పాటు చేస్తూ జీఓ విడుదల చేసింది.
జీఓ విడుదలతో సరిపెట్టిన సర్కారు
ఆ తర్వాత ముందుకు సాగని ప్రక్రియ
ఏడాదిన్నరగా నిధుల కోసం ఎదురుచూపులు
కొడంగల్ తరహాలో అభివృద్ధి చేయాలనే డిమాండ్
హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చే గ్రామాలివే..
రీజినల్ రింగ్ రోడ్డుకు వెలుపల ఐదు కిలోమీటర్ల వరకు హెచ్‌ఎండీఏ పరిధిని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో వికారాబాద్, నవాబుపేట, పూడూరు మండల కేంద్రాలు ఈ పరిధిలోకి వచ్చాయి.
పూడూరు మండలంలో..
అంగడిచిట్టెంపల్లి, చన్గోముల్, చీలాపూర్, చింతల్‌పల్లి, కండ్లపల్లి, కంకల్, కెరవెళ్లి, కడ్మూర్, కొత్తపల్లి, మంచన్‌పల్లి, మన్నెగూడ, మేడిపల్లి, మిర్జాపూర్, మిట్టకంకల్, నిజామ్‌పేట్ మేడిపల్లి, పెద్ద ఉమ్మెంతాల్, పూడూరు, కుద్భుల్లాపూర్, రేగడిమామిడిపల్లి, పోమన్‌గుర్తి, తిర్మలాపూర్, ఎన్కెపల్లి, తుర్కెన్కెపల్లి గ్రామాలు హెచ్‌ఎండీఏ పరిధిలోకి రానున్నాయి.
నవాబుపేట మండలంలో..
అక్నాపూర్, చించల్‌పేట్, గంగ్యాడ; గుబ్బడిఫతేపూర్, లింగంపల్లి, మాదిరెడ్డిపల్లి, ముబార క్‌పూర్, నవాబుపేట, పూలపల్లి, పులిమామిడి, ఎల్లకొండ గ్రామాలు ఈ పరిధిలోకి రానున్నాయి.
వికారాబాద్ మండలంలో..
బూర్గుపల్లి, దన్నారం, గెర్‌గెట్‌పల్లి, గుడుపల్లి, కొంపల్లి, మద్గుల్‌చిట్టెంపల్లి, పాతూరు, పీరంపల్లి, పులుసుమామిడి, సిద్దులూరు(చెంచలం), సిద్దులూరు(పాయాగ), సిద్దులూర్(మునుగాల), వికారాబాద్(జిల్లా కేంద్రం)
మోమిన్‌పేట మండలంలో..
చీమల్‌దరి, చక్రంపల్లి, దేవరంపల్లి గ్రామాలు..
పరిగి మండలంలో.. చిట్యాల్, మాదారం, రాపోల్, తొండపల్లి గ్రామాలు హెచ్‌ఎండీఏ పరిధిలోకి రానున్నాయి.


