ఇబ్రహీంపట్నం: ఓ మహిళ మెడలోని మంగళసూత్రాన్ని లాక్కొని పరారైన ఇద్దురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నంకు చెందిన ఐతరాజు అనురాధ (40) స్థానిక ఆస్పత్రి మార్చురి రోడ్డులో గత మంగళవారం సాయంత్రం నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన దుండుగులు ఆమె మెడలోని మూడు తులాల బంగారు మంగళసూత్రం లాక్కొని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ పుటేజీలను పరిశీలించి, దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలించారు. ఈ నేపథ్యంలో సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి ఆదివారం అరెస్టు చేశారు. ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామానికి చెందిన ఓరుగంటి శివప్రసాద్ (30) ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తూ మంచాలలో నివసిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఈర్లపల్లి కరుణాకర్ (28)అనే బైక్ మెకానిక్‌తో స్నేహం ఏర్పడింది. ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ఇద్దరూ కలిసి చోరీకి పాల్పడ్డారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చాకచక్యంగా వ్యవహరించి తక్కువ సమయంలో కేసును ఛేదించిన క్రైమ్ సిబ్బంది యాదగిరి, రాజు, బాబురావు, చంద్రశేఖర్, మధును ఏసీపీ కేవీపీ రాజు, సీఐ మహేందర్‌రెడ్డి అభిందించారు.


