ఏడు అంశాలపై ఎజెండా | - | Sakshi
Sakshi News home page

ఏడు అంశాలపై ఎజెండా

Nov 16 2026 8:41 AM | Updated on Nov 16 2026 8:41 AM

తాండూరు: ప్రధాన సమస్యల పరిష్కారం.. ఎల్‌నినో నేపథ్యంలో నీటి ఎద్దడి నివారణతోపాటు పలు కీలక అంశాలపై నేడు తాండూరు మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యులు సమావేశం కానున్నారు. చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. కౌన్సిల్‌లో ఏడు అంశాలతో కూడిన ఎజెండాను అధికారులు సభ్యుల ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నారు. పట్టణ పరిధిలో నెలకొన్న సమస్యలు, మౌలిక వసతుల కల్పన, పండుగల ఏర్పాట్లు, ప్రభుత్వ పథకాల అమలు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలపై చర్చించనున్నారు. గత నెలలో మున్సిపాలిటీకి ఆదాయం తక్కువ రావడం.. ఖర్చులు భారీగా ఉండటంపై చర్చ జరిగే అవకాశం ఉంది. అక్టోబర్‌ నెలలో రూ.77.76 లక్షల ఆదాయం రాగా అధికారులు, పాలకవర్గం చేసిన ఖర్చు రూ.1.20 కోట్లు ఖర్చు.. ఇందుకు సంబంధించిన లెక్కలు ఎజెండాలో సభ్యులు వివరించనున్నారు. ప్రస్తుత ఎజెండాను పరిశీలిస్తే పట్టణంలో తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలతో పాటు గతంలో చేపట్టిన పనులకు సంబంధించిన ఖర్చుల వివరాలు, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఆర్థిక అనుమతులు పొందడంపై అధికారులు దృష్టి సారిచినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు భారీగా పడిపోవడం.. నీటి ఎద్దడి నెలకొనడం.. మిషన్‌ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం తదితర అంశాలను చర్చించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోనున్నారు. సభ్యుల అభ్యర్థన మేరకు అవసరమైన వార్డుల్లో వాటర్‌ ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరాకు రూ.5 లక్షల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించారు. ఈ మొత్తాన్ని ఎస్‌ఎఫ్‌సీ, మున్సిపల్‌ జనరల్‌ ఫండ్స్‌ నుంచి ఖర్చు చేసేందుకు ఎజెండాలో చేర్చారు.

హైమాస్ట్‌ లైట్ల కోసం..

పట్టణ పరిధిలోని ప్రధాన రహదారుల్లో హైమాస్ట్‌ లైట్లు వెలగకపోవడంతో ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఎజెండాలో పేర్కొన్నారు. 36 వార్డులను రెండు విభాగాలుగా విభజించారు. ఒకటి నుంచి 18వ వార్డు వరకు రూ.5 లక్షలు, 19 నుంచి 36వ వార్డు వరకు మరో రూ.5 లక్షలతో హైమాస్ట్‌ లైట్ల మరమ్మతులకు వెచ్చించాలని ప్రతిపాదించారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ అర్బన్‌ 2.0లో భాగంగా పట్టణ సుందరీకరణ, గోడలపై చిత్రలేఖనం, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలకు రూ.10.82 లక్షలు కేటాయించాలని నిర్ణయించారు. వాల్‌ పెయింటింగ్స్‌కు రూ.5.82 లక్షలు, అవగాహన కార్యక్రమాలకు రూ.5 లక్షలు ఎజెండాలో ప్రవేశపెట్టనున్నారు. ఏటా వీధి కుక్కల సంఖ్య పెరుగుతుండటంతో వాటి నియంత్రణకు చర్యలు చేపట్టాలని ప్రతిపాదించారు. అందుకోసం బ్లూక్రాస్‌ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆపరేషన్‌ చేయించాలని పొందుపర్చారు. అయితే ప్రధాన ప్రతిపక్ష కౌన్సిల్‌ సభ్యులు నిధుల కేటాయింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నేటి సమావేశం ప్రశాంతంగా ముగుస్తుందా లేదా పక్కదారి పడుతుందా అనే దానిపై స్థానికంగా చర్చ జరుగుతోంది.

నేటి మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం ముందుకు బిల్లు

సిద్ధం చేసిన అధికారులు

నీటి ఎద్దడి నివారణకు రూ.5 లక్షలు

హైమాస్ట్‌ లైట్ల మరమ్మతులకు రూ.10 లక్షలు

‘స్వచ్ఛభారత్‌’ అంచనా వ్యయం రూ.10.62 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement