కందుకూరు: మహేశ్వరం జోన్ పరిధిలోని కందుకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో రూ.1.50 కోట్ల విలువైన 11 కేజీల హష్ ఆయిల్ పట్టుబడింది. ఈ మేరకు శుక్రవారం కందుకూరు ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహేశ్వరం జోన్ డీసీపీ నారాయణరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. లంబసింగి నుంచి ఖమ్మం, మిర్యాలగూడ, దేవరకొండ, కల్వకుర్తి మీదుగా కందుకూరు వైపు నుంచి హైదరాబాద్‌కు హష్ ఆయిల్ తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో మహేశ్వరం జోన్ ఎస్‌ఓటీ పోలీసులు, కందుకూరు పోలీసులు సంయుక్తంగా శుక్రవారం ఉదయం శ్రీశైలం జాతీయ రహదారిలోని నవారుబాల్‌రెడ్డి ఫంక్షన్‌హాల్ ఎదుట వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో టీఎస్07 హెచ్‌టీ 6393 నంబర్‌తో ఉన్న మారుతి స్విఫ్ట్ కారును ఆపి తనిఖీ చేశారు. కారులో ఉన్న నల్లగొండ జిల్లాకు చెందిన మెరుపోజు రవివర్మ, జర్పలు లోకేశ్, సయ్యద్ సోహెల్ హుస్సేన్‌ను అదుపులోకి తీసుకుని వారి వద్ద బ్యాగులను తనిఖీ చేయగా 11 ప్యాకెట్లలో నల్లటి రంగులో ఉన్న పదార్థాన్ని గుర్తించారు. సాధారణంగా 50 కేజీల గంజాయి నుంచి ఒక లీటరు ఆయిల్ వస్తుంది. ఇలా 11 కేజీల కోసం 550 కేజీల గంజాయి వాడినట్లు తెలిసింది. హష్ ఆయిల్ సహా రెండు మొబైల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. జీవనోపాధి నిమిత్తం నగరానికి వచ్చిన రవి వర్మ చదువు మధ్యలో ఆపి మద్యం, డ్రగ్స్‌కు బానిసయ్యాడు. ఈ క్రమంలో లంబసింగికి చెందిన డ్రగ్ పెడ్లర్ బన్నీతో పరిచయం పెంచుకుని ఈ అక్రమ రవాణాకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ విలేకరుల సమావేశంలో ఏసీపీ జానకిరెడ్డి, సిఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఓటీ ఎస్‌ఐ సురేశ్ తదితరులు ఉన్నారు.


