డిజిటల్ ఎన్‌ఓసీ
షాద్‌నగర్: గణపతి నవరాత్రి ఉత్సవాలకు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. ఉత్సవాల ప్రారంభానికి ఒక్క రోజు గడువు మాత్రమే ఉంది. వేల సంఖ్యలో విగ్రహాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఉత్సవాలను పురస్కరించుకుని మండపాల ఏర్పాటు, నిమజ్జన ఊరేగింపుల కోసం నిర్వాహకులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోలీసు శాఖ సాంతికేతిక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేక పోర్టల్ సేవలను ప్రారంభించింది.
అనుమతులు తప్పని సరి
గణేశ్ మండపాల ఏర్పాటుకు, నవరాత్రి ఉత్సవాల నిర్వాహణకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. ఆన్‌లైన్‌లో పూర్తి వివరాలతో ధరఖాస్తు చేసుకొని ఆ ప్రతులను సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో అందజేయాలి. ఉత్సవాలు ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తున్నారో పోలీసులకు సమాచారం ఇవ్వాలి. మండపాలకు విద్యుత్ కనెక్షన్ కోసం అధికారుల అనుమతి తప్పక తీసుకోవాలి.
నిబంధనలు
● మండపం ఏర్పాటుకు రోడ్లును బ్లాక్ చేయొద్దు. ప్రజలకు అసౌకర్యం కలిగించొద్దు.
● మండపాల వద్ద విధిగా నిర్వాహకుల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
● మండపాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. లేదంటే డయల్ 100కు ఫోన్ చేయాలి.
● మండపాల వద్ద పూజా సామగ్రి, అగ్గి పెట్టెలు, హారతుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
● అనుమతించిన సమయంలో మాత్రమే మైకులు వాడాలి. డీజేలు, అధిక శబ్దాలు వచ్చే స్పీకర్లును పూర్తిగా నివారించి ధ్వని కాలుష్య నిబంధనలు పాటించాలి
● భక్తులను గైడ్ చేసేలా వలంటీర్లను నియమించాలి.
● రాత్రి వేళల్లో విధిగా మండపాల వద్ద ఇద్దరు వ్యక్తులు ఉండాలి. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు, వ్యాఖ్యలు చేయొద్దు.
● మండలపాలను తగినంత దూరంలో ఏర్పాటు చేయాలి. విద్యుత్ లైన్ల కింద, వాటికి దగ్గరగా ఏర్పాటు చేయొద్దు. విద్యుత్ తీగలను తాకే ఎలాంటి లైటింగ్ స్వాగత తోరణాలు ఏర్పాటు చేయొద్దు.
● విద్యుత్ స్తంభాలకు జెండాలను, బ్యానర్లు, ఇతర అలంకరణ సామాగ్రి కట్టొద్దు. ప్రతి మండపంలో నాణ్యమైన విద్యుత్ వైర్లు వాడాలి. ఎర్తింగ్ ఉండేలా చూసుకోవాలి.
● విద్యుత్ తీగలు తెగినా, పడిపోయినా, స్పార్కింగ్‌లు వచ్చినా వెంటనే అధికారులకు సమాచారం అందించాలి.
గణేశ్ మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్ అనుమతులు
సాంకేతిక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన పోలీసు శాఖ
డిజిటల్ ఎన్‌ఓసీ పత్రాన్ని నేరుగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం
నిర్వాహకులు ముందుగా పోలీసు శాఖ అధికార పోర్టల్ www.tspolice.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. కమిటీ సభ్యుల వివరాలు, నిమజ్జన ప్రదేశం, మార్గం, వంటి సమాచారాన్ని నమోదు చేయాలి. పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేస్తారు. పరిశీలన పూర్తయిన వెంటనే మండపాలకు ఆన్‌లైన్‌లోనే అనుమతులు జారీ చేస్తారు. ప్రత్యేక క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ ఎన్‌ఓసీ పత్రాన్ని నిర్వాహకులు నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


