రేషన్ పంపిణీ వివరాలు
● ఈ నెలాఖరులోగా నమోదు చేయకపోతే కార్డు రద్దు
● ‘సాక్షి’తో సివిల్ సప్లయ్ అధికారి వనజాత స్పష్టీకరణ
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘ఈకేవైసీ కోసం రేషన్‌షాపునకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి.. చేతిలోని మొబైల్ ఫోన్‌లో మై రేషన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ఓటీపీ ఆధారంగా ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు’అని జిల్లా సివిల్ సప్లయ్ అధికారి వనజాత స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.
పోర్ట్‌ల్‌లో రెడ్‌మార్క్
రెండోసారి ఆధార్ అప్‌డేషన్ తర్వాత ఐదేళ్లు దాటిన పిల్లలు ఈకేవైసీ చేయించలేదు. కార్డులో పేరు ఉన్నప్పటికీ.. పోర్ట్‌ల్‌లో రెడ్‌మార్క్ ఉండడంతో బియ్యం సరఫరా నిలిపివేయాల్సి వచ్చింది. వీరంతా సెప్టెంబర్ 30లోగా ఈకేవైసీ చేయించుకోవాలి. లేదంటే వారిని కూడా చనిపోయిన వారి జాబితాలో చేర్చి, కార్డు నుంచి పేరును తొలగించాల్సి వస్తుంది.
స్మార్ట్‌కార్డులు సిద్ధం
ప్రస్తుతం ఉన్న కాగితపు కార్డుల స్థానంలో ప్రభుత్వం క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్‌కార్డులను పంపిణీ చేస్తోంది. డెబిట్‌కార్డు/ఏటీఎం కార్డు పరిమాణంలో ప్లాస్టిక్ పీవీసీ రూపంలో ఉంటుంది. ఇప్పటికే 6,68,571 కార్డులను ముద్రించాం. ఆగస్టు 15న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఈ స్మార్ట్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం అంగన్‌వాడీలు, పంచాయతీ కార్యదర్శులు వీటిని పంపిణీ చేస్తున్నారు.
దొడ్డు బియ్యం విక్రయానికి టెండర్
ప్రభుత్వం 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి సన్న బియ్యం పంపిణీ పథకాన్ని తీసుకొచ్చింది. ఆహార భద్రత కార్డు కలిగిన ప్రతీ సభ్యుడికి నెలకు ఆరు కేజీల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. దీంతో దొడ్డు బియ్యం సరఫరా నిలిచిపోయింది. అంతకు ముందే మిల్లర్ల నుంచి సేకరించి, రేషన్ షాపులకు సరఫరా చేసిన 1,900 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం డీలర్ల వద్ద మిగిలిపోయింది. ఈ బియ్యాన్ని విక్రయించేందుకు ఈ టెండర్ పిలిచాం. కేజీకి రూ.21.60 ధర నిర్ణయించాం. త్వరలోనే గిడ్డంగులు, రేషన్ దుకాణాల్లో మిగిలిన బియ్యాన్ని విక్రయిస్తాం.
అక్రమార్కులపై ఉక్కుపాదం
‘మార్కెట్లో బియ్యానికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కొంత మంది అక్రమ దందాకు తెరలేపారు. లబ్ధిదారులు, డీలర్ల నుంచి తక్కువ ధరకు సేకరించి, సరిహద్దులు దాటిస్తున్నారు. వారిపై ఉక్కుపాదం మోపుతున్నాం. జులై, ఆగస్టు మాసా ల్లో 400 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నాం. వాటిని కూడా వేలం వేస్తాం’అని వనజాత స్పష్టం చేశారు.
చౌకధరల దుకాణాలు 936
ఆహార భద్రత కార్డులు 6,75,072
మొత్తం లబ్ధిదారులు 23,03,793
ఈకేవైసీ పూర్తయినవి 17,72,983
పూర్తి కానివి 5,30,810
ప్రతినెలా బియ్యం పంపిణీ 14,379
మెట్రిక్ టన్నులు
ముద్రించిన స్మార్ట్‌కార్డులు 6,68,571
స్మార్ట్‌కార్డుల పంపిణీ ఇబ్రహీంపట్నంలో
ఆగస్టు 15న


