సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా నేదునూరు గ్రామంలో జరిగిన రియల్‌ఎస్టేట్ వ్యాపారి బాణాల రాంరెడ్డి ఆత్మహత్య ఘటన సంగారెడ్డి జిల్లాలోనూ కలకలం రేపింది. ఈ ఆత్మహత్యకు కారణం పటాన్‌చెరు ప్రాంతంలోని ఓ భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ భూ వివాదాలే కారణమని ప్రాథమికంగా తేలడం చర్చనీయాంశంగా మారింది. రాంరెడ్డి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులకు అందులో కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. రామేశ్వరం బండ ప్రాంతంలో రాంరెడ్డి సుమారు 200 ఎకరాలకు భారీ వెంచర్ వేశారు. ఈ వెంచర్ భూవివాదాలే ఆత్మహత్యకు దారితీశాయని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నట్లు సమాచారం.
వాయిస్ రికార్డులో కీలక అంశాలు..
పోలీసులు స్వాధీనం చేసుకున్న రాంరెడ్డి సెల్‌ఫోన్‌లో ఉన్న వాయిస్ రికార్డుల్లో కీలక అంశాలున్నట్లు తెలుస్తోంది. ఆయన డెవలప్‌చేస్తున్న వెంచర్‌కు సంబంధించిన భూమి యజమానులకు ఈ వాయిస్ రికార్డులు పంపినట్లు సమాచారం. ఈ భూవివాదాన్ని పరిష్కరించుకునేలా చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని ఈ రికార్డుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధిత భూమి యజమానుల నుంచి స్పందన లేకపోవడంతో మనస్తాపానికి గురైనట్లు భావిస్తున్నారు. ఈ వెంచర్‌కు భూములను హెచ్‌ఎండీఏ క్లియరెన్స్‌ల కోసం ఇప్పటికే ఆయన రెండు, మూడు పర్యాయాల్లో సుమారు రూ.28 కోట్ల వరకు వెచ్చించినట్లు ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. కాగా రాంరెడ్డి క్షేత్రస్థాయి నుంచి అంచెలంచెలుగా ఆర్థికంగా ఎదిగారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఈ వెంచర్‌తోపాటు, పటాన్‌చెరు ప్రాంతంలో మరికొన్ని వెంచర్లు అభివృద్ధి చేశారు. రాంరెడ్డి దగ్గరి బంధువుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఈ వెంచర్‌లో పెట్టుబడులు పెట్టి వివాదంలో కూరుకుపోయినట్లు తెలుస్తోంది.
ప్రజాప్రతినిధుల ప్రమేయంపైనా
ప్రచారం!
ఈ కేసులో రాంరెడ్డికి ఉన్న ఆర్థిక ఇతర ఇబ్బందులు ఒక అంశమైతే.. పటాన్‌చెరుకు చెందిన ప్రజాప్రతినిధుల వేధింపులు కూడా మరో కారణమనే ప్రచారం జరుగుతోంది. ఈ వెంచర్‌కు సంబంధించి స్థానిక కీలక ప్రజాప్రతినిధులు వాటాలు, పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ భూముల జోన్ మార్పిడి వ్యవహరంలోనూ ఈ ప్రజాప్రతినిధులు పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుని అధికారులకు సిఫార్సులు చేసినట్లు సంబంధిత వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వెంచర్ భూవివాదంలో పోలీసు అధికారి పాత్ర కూడా తెరపైకి వస్తోంది. గతంలో ఇక్కడ పనిచేసి వెళ్లిన ఓ పోలీసు అధికారి ఈ భూవివాదాల్లో కలగజేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. సదరు పోలీసు అధికారి సెటిల్‌మెంట్ చేసినట్లు చర్చ జరుగుతోంది.
కలకలం రేపిన రియల్ వ్యాపారి రాంరెడ్డి ఆత్మహత్య
పటాన్‌చెరు సమీప వెంచర్ భూ వివాదాలే కారణం!
పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌లో కీలక అంశాలు


