ప్రారంభించిన కమిషనర్ రంగనాథ్
● ‘1070’తో 24 గంటలూ హెల్ప్‌లైన్
సాక్షి, సిటీబ్యూరో: హైడ్రా అధికారిక పోర్టల్ (https://hydraa.telangana.gov.in) శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. కమిషనర్ ఏవీ రంగనాథ్ తన కార్యాలయంలో ప్రారంభించారు. దీంతో ఈ విభాగం అందిస్తున్న సేవల వివరాలతో పాటు కార్యకలాపాలను తెలుసుకునే అవకాశం ఏర్పడింది. చెరువుల హద్దులు, కాలువల లెక్కలు, ప్రభుత్వ భూముల వివరాలు, విపత్తు నిర్వహణ సమాచారంతో పాటు హైడ్రా కార్యకలాపాలన్నీ ఈ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. 24 గంటలూ అందుబాటులో ఉండే అత్యవసర హెల్ప్‌లైన్ ‘1070’ వివరాలను పోర్టల్‌లో పొందుపరిచారు. చెట్లు కూలిపోవడం, అగ్ని ప్రమాదాలు, రహదారులపై నీరు నిలవడం, వరదలు, సహాయక చర్యలు, ఇతర విపత్తు సంబంధిత అత్యవసర పరిస్థితులపై పౌరులు ఈ నంబరుకు సమాచారం ఇవ్వొచ్చు. హైడ్రా పోర్టల్ ద్వారానే ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసీలకు దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉంది. భవన యజమానులు, నిర్మాణదారులు దరఖాస్తు చేసుకోవడంతో పాటు అది ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు. భారీ వర్షాలు, వరదల సమయంలో నీరు నిలిచే అవకాశం ఉన్న కీలక ప్రాంతాల వివరాలను ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు.
చెరువుల ఎఫ్‌టీఎల్, నిబంధనలు..
మూడు కమిషనరేట్లలోని వాటర్‌లాగింగ్, వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన మ్యాప్‌లను వేర్వేరుగా చూడవచ్చు. దీంతో భారీ వర్షాల సమయంలో అధికారులు పర్యవేక్షించే ముఖ్య ప్రాంతాలను పౌరులు ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ పోర్టల్ ద్వారా లైవ్ రైన్‌ఫాల్ మ్యాప్స్, రోజువారీ వర్షపాతం వివరాలు, వాతావరణ అంచనాలు, హైదరాబాద్ డాప్లర్ రాడార్ సమాచారం అందుబాటులో ఉంటుంది. హైడ్రా వెబ్‌సైట్ ద్వారా హెచ్‌ఎండీఏ లేక్ పోర్టల్‌ను సందర్శించి చెరువులకు సంబంధించిన ఎఫ్‌టీఎల్ వివరాలను తెలుసుకోవచ్చు. చెరువులు, ఇతర జలాశయాల చుట్టూ అమల్లో ఉండే ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ నిబంధనలూ ఇందులో ఉంటాయి. చెరువుల సమీపంలో భవన నిర్మాణం లేదా ఇతర అభివృద్ధి పనులు చేపట్టే ముందు వర్తించే నిబంధనలను తెలుసుకునేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది.


