కడ్తాల్: పర్యావరణ పరిరక్షణతోనే భవిష్యత్ అని విశ్రాంత ఐఏఎస్ అధికారి జగదీశ్ శర్మ అన్నారు. సీజీఆర్ పర్యావరణ సంస్థ–తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నిర్వహించిన (లీడ్ ఎర్త్ లీడర్) రెండు రోజుల శిక్షణ శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖలో తీసుకువస్తున్న వినూత్న కార్యక్రమాలు దేశానికే ఆదర్శమన్నారు. పాఠశాలలు పర్యావరణ చైతన్య కేంద్రాలుగా మార్చాలనే ఆలోచన అభినందనీయమన్నారు. లీడ్ ఎర్త్ లీడర్స్ అనే పేరులోనే నాయకత్వ లక్షణం ఉందన్నారు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు తలుచుకుంటే గ్రామ భవిష్యత్‌ను మార్చేయగలడని చెప్పారు. ఎర్త్ క్లబ్ అంటే ఉద్యమమని పాఠశాలల్లో పిల్లల చేత మొక్కలు నాటించి, పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. సేంద్రియ తోటలను పెంచడం, వర్షం నీటిని సంరక్షించడం, నీటి సంరక్షణ, అటవీ పరిరక్షణ, వ్యర్థాల నిర్వాహణ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, కిచెన్‌గార్డెన్‌ల ఏర్పాటు, హరితహారం, జీవవైవిధ్యం, సోలార్ ఎనర్టీ వంటి అంశాలపై ఆచారణత్మతక శిక్షణ ఇచ్చారు. అనంతరం శిక్షణలో ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీజీఆర్ చైర్ పర్సన్ లీలా లక్ష్మారెడ్డి, ఫౌండర్ లక్ష్మారెడ్డి, విద్యావేత్త ఉపేందర్‌రెడ్డి, వందేమాతరం ఫౌండేషన్ మాధవరెడ్డి, వైఈఎల్పీ కోఆర్డినేటర్ వెంకట్‌రెడ్డి, విశ్రాంత డీఈఓ వెంకటేశ్వర్లు, పర్యావరణ వేత్త ఉమామహేశ్వర్‌రెడ్డి, నవ్య, నగేశ్, రజనీకాంత్, వైష్ణవి, మహాలక్ష్మి, మద్దిలేటి, శివ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


