అమ్మలేం.. కొనలేం! | - | Sakshi
Sakshi News home page

అమ్మలేం.. కొనలేం!

Aug 25 2026 12:04 PM | Updated on Aug 25 2026 12:04 PM

వికారాబాద్‌: అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ప్రజల ఆస్తులకు గ్రహణం పట్టింది. మున్సిపాలిటీల పరిధిలోని పలు కాలనీలు, నివాసా లను 22– ఏ (నిషేధిత) జాబితాలో చేర్చారు. రెవెన్యూ అధికారులు తయారు చేసిన ఈలిస్ట్‌ ఆధారంగా సబ్‌ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లను నిలిపివేయడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మూడు మేజర్‌ మున్సిపాలిటీల పరిధిలోని పదుల సంఖ్యలో కాలనీలను ప్రొహిబిటెడ్‌లో చేర్చారు. నాలా (నాన్‌ అగ్రికల్చర్‌ కన్వర్షన్‌) చేసిన భూములను తిరిగి వ్యవసాయ భూముల తరహాలో గుర్తించి రిజిస్ట్రేషన్లు జరగకుండా ఉండేందుకే ఈ జాబితాలో చేర్చినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. లిస్ట్‌లో ప్రొహిబిటెడ్‌గా ఉన్నందున రిజిస్ట్రేషన్లు చేయడం లేదని సబ్‌ రిజిస్ట్రార్లు పేర్కొంటున్నారు. శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ఎందుకు చేర్చారో, ఎందుకు ఆపారో స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో నిబంధనల ప్రకారం ఉన్న తమ ఆస్తులను పీఓబీ నుంచి తొలగించాలని దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకోసం మళ్లీ అధికారులు, నేతలకు ముడుపులు ఇవ్వాల్సి వస్తోందని బాధితులు చెబుతున్నారు.

ప్రొహిబిటెడ్‌లో కాలనీలు

వికారాబాద్‌ మున్సిపాలిటీలో 35కు పైగా వెంచ ర్లను ఈ జాబితాలో చేర్చారు. వీటిలో చాలా వరకు డీటీసీపీ అప్రూవల్‌ పొందినవే ఉన్నాయి. 1983 ప్రాంతంలో లేఅవుట్లు వేసిన కాలనీల్లో ఇప్పుడు ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నవి కూడా ఉన్నాయి. వికారాబాద్‌ పాత పట్టణం చుట్టూ కొత్తగా ఏర్పడిన కాలనీల్లో ఎక్కువ శాతం నిషేధిత జాబితాలోకి చేరాయి. తాండూరు మున్సిపాలిటీలో 77 ఎకరాలను, పరిగి మున్సిపల్‌ పరిధిలో వందకు పైగా నివాసాలను 22– ఏ జాబితాలో చేర్చారు. దీంతో గత ఇరవై రోజులుగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు మందగించాయి. వికారాబాద్‌, తాండూరులో రోజుకు 25 నుంచి 35 వరకు జరిగే రిజిస్ట్రేషన్లు ఇప్పుడు పది కూడా కావడం లేదని, మార్ట్‌గేజ్‌ లాంటివి మాత్రమే అవుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు.

జనం ఆస్తులకు గ్రహణం

నిషేధిత జాబితాలో నివాసాలు, వెంచర్లు

పలు చోట్ల కాలనీ మొత్తాన్ని 22– ఏలో చేర్చిన వైనం

జిల్లా కేంద్రంలో 35కు పైగా వెంచర్లు ఇందులోనే ..

తాండూరులో 77 ఎకరాలు ‘ప్రొహిబిటెడ్‌’

రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో మందగించిన క్రయవిక్రయాలు

లిస్ట్‌ నుంచి తీసేందుకు ముడుపులు ఇవ్వాల్సిన దుస్థితి

మున్సిపాలిటీలకు ఆనుకుని ఉన్న సీలింగ్‌, వక్ఫ్‌, అసైన్డ్‌ భూములను గతంలో పట్టా భూములుగా మార్చి లేఅవుట్లు వేసి అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమార్కుల భూములను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించడంతో రెవెన్యూ అధికారులు గత ఆరు నెలలుగా కసరత్తు చేసి జాబితాను 22– ఏ రిజిస్టర్‌లో చేర్చారు. ఈక్రమంలో ఒకే సర్వే నంబర్‌ కలిగి ఉన్న పలు లీగల్‌ లేఅవుట్లు కూడా ఇందులోకి వెళ్లిపోయాయి. ఎప్పుడో చేయాల్సిన పనిని అంతా జరిగిపోయాక ఇప్పుడు చేయడంతో అక్రమంగా లేఅవుట్లు వేసి సొమ్ము చేసుకున్నవారు తప్పించుకోగా, ప్లాట్లు కొన్న అమాయక ప్రజలు బలవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

సామాన్యులకు ఇబ్బంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement