తాండూరు టౌన్: కంది రైతులకు కష్టం వచ్చింది. ఏపుగా పెరిగిన పంటకు ఎండు తెగులు (ఫైటోఫ్తోరా) ఆశించడంతో నిలువునా ఎండిపోతోంది. పూత, కాత దశకు వచ్చే సమయంలో తెగులు వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో దిగుబడులు భారీగా తగ్గే ప్రమాదం ఉంది. ఈసారైనా కంది పంటతో కష్టాలు తీరుతాయని ఆశపడిన రైతులకు నిరాశే మిగిలింది. రోజుల వ్యవధిలోనే పంట మాడు తెగులు బారిన పడి నష్టపోతున్నారు. ఇప్పటికే జిల్లాలో వందలాది ఎకరాల్లో కంది పంట కట్టెలా మారుతోంది.
పత్తి తర్వాత కంది..
వికారాబాద్ జిల్లాలో పత్తి తర్వాత అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యేది కంది పంటే. ఇక్కడ పండించిన కంది పప్పునకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఖరీఫ్ సీజన్ నుంచే రైతులు ఏర్పాట్లు చేసుకుంటారు. దుక్కి దున్ని విత్తనాలు వేసి కలుపు తీసి ఎరువులు చల్లి పురుగు మందులు పిచికారీ చేసి పంట చేతికొస్తుందనే ఆశలో ఉన్న రైతులకు తెగుళ్ల రూపంలో నష్టం ఏర్పడుతోంది. జిల్లాలో కంది సాగు అధికంగా ఉండటంతో తాండూరులో వ్యవసాయ పరిశోధన స్థానాన్ని ఏర్పాటు చేశారు. కొత్త వంగడాల తయారీతో పాటు రైతులకు అవగాహన కల్పించేందుకు శాస్త్రవేత్తలు అందుబాటులో ఉన్నారు. అయితే ఈ ఏడాది వానాకాలంలో వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించి సాగు చేస్తున్నా తెగుళ్లు వ్యాప్తి కర్షకులను ఇబ్బంది పెడుతోంది.
1.11 లక్షల ఎకరాల్లో సాగు
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1.11 లక్షల ఎకరాల్లో కంది సాగవుతోందని అధికారులు ధ్రువీరించారు. తాండూరులో 47,870 ఎకరాలు, కొడంగల్‌లో 24,940, వికారాబాద్‌లో 20,713, పరిగిలో 8,057 ఎకరాల్లో సాగులో ఉంది. ప్రస్తుతం కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, దుద్యాల, తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లో తెగులు వేగంగా వ్యాపిస్తోంది.
కంది పంటకు వేగంగా విస్తరిస్తున్న మాడు తెగులు
ఏపుగా పెరిగినా ఎండిపోతున్న మొక్కలు
సస్యరక్షణ చర్యలతోనే నివారణ
శాస్త్రవేత్తలు రాజేశ్వర్‌రెడ్డి, సుధారాణి సూచనలు
లక్షణాలు..
లేత మొక్కలు అకస్మాత్తుగా చనిపోవడం.
ఆకులపై నీటి మచ్చలు, కాండం, ఆకు కాడలపై గోధుమ, నల్లని మచ్చలు, సోకిన చోట పుండు ఏర్పడి విరిగిపోవడం.
నివారణ..
కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి, మెటాలాక్సిల్ 25% డబ్ల్యూపీ 6 గ్రాములు కలిపి విత్తనశుద్ధి చేయాలి.
లోతట్టు, నీరు నిలిచే పొలాల్లో కంది వేయరాదు.
వర్షపు నీరు నిలవకుండా తీసేయాలి.
బోదెలు, కాలువల పద్ధతిలో బోదెలపై విత్తాలి.
తెగులు సోకిన పంటపై లీటరు నీటికి 2.5 గ్రాముల మెటాలాక్సిల్ కలిపి నాజిల్ తీసి మొక్క మొదలు తడిచేలా పిచికారీ చేయాలి.
శాస్త్రవేత్తల సూచనలు
తేమ, మేఘావృత వాతావరణం ఈ తెగుకు అనుకూలం. భూమిలో నివసించే ఫైటోఫ్తోరా శిలీంధ్రంతో వస్తుంది. వారం నుంచి ఏడు వారాల మొక్కలకు సోకి గుంపులుగా చనిపోతాయి. స్వల్పకాలిక రకాల్లో నష్టం ఎక్కువ. 30 నుంచి 40 శాతం దిగుబడి తగ్గుతుంది.


