చిన్న ప్లాటు.. పెద్ద ఊరట! | - | Sakshi
Sakshi News home page

చిన్న ప్లాటు.. పెద్ద ఊరట!

Aug 21 2026 9:44 AM | Updated on Aug 21 2026 9:44 AM

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) మొదటిసారిగా తక్కువ విస్తీర్ణం కలిగిన ప్లాట్‌లను విక్రయానికి సిద్ధం చేసింది. సామాన్య, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసిన ఇన్ముల్‌నర్వ లేఅవుట్‌ ఆయా వర్గాలను విశేషంగా ఆకట్టుకుంటోంది. జిల్లాలోని కొత్తూరు, ఫరూఖ్‌నగర్‌ మండలాల్లో విస్తరించిన ఈ లే అవుట్‌ కోసం అప్పట్లో రైతుల నుంచి భూములు సేకరించి అభివృద్ధి చేశారు. ప్రస్తుతం 95.25 ఎకరాల్లో 60 ప్లాట్లను విక్రయించనున్నారు. గజానికి రూ.15,000 కనీస ధరగా నిర్ణయించారు. శ్రీశైలం హైవేను ఆనుకొని ఉన్న ఈ లేఅవుట్‌లో ఒక ప్లాట్‌ కనిష్టంగా 152 గజాలు (ఈ–28) ఉంటే మరో ప్లాట్‌ గరిష్టంగా 300 గజాలు (ఎఫ్‌89) ఉంది. మిగతా 58 ప్లాట్‌లన్నీ 200 గజాల విస్తీర్ణంతో ఉన్నాయి. సామాన్య, మధ్యతరగతి వర్గాలు తమ సొంతింటి కలను నెరవేర్చుకొనేందుకు ఈ స్థలాలు ఎంతో అనుకూలంగా ఉంటాయని, అందుబాటు ధరల్లోనే లభించడంతో ఆర్థికంగా ఊరట లభిస్తుందని హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఐదేళ్లలో వివిధ ప్రాంతాల్లో స్థలాలను విక్రయించినప్పటికీ చాలాచోట్ల భారీ విస్తీర్ణం కలిగినవే ఉన్నాయి. మరోవైపు వ్యాపార, వాణిజ్య అవసరాల కోసం ఏర్పాటు చేసినవే ఎక్కువ. బోడుప్పల్‌, మేడిపల్లి, హయత్‌నగర్‌, తొర్రూర్‌ తదితర ప్రాంతాల్లో రెసిడెన్షియల్‌ లే అవుట్‌లను అభివృద్ధి చేసినప్పటికీ భారీ ధరల కారణంగా అల్పాదాయ, మధ్యతరగతి వర్గాలు ఆ ప్లాట్‌లను కొనుగోలు చేయలేకపోయారు. షాద్‌నగర్‌ సమీపంలో ఉన్న ఇన్ముల్‌నర్వ ఆ లోటును భర్తీ చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఏడాదిన్నరలో సదుపాయాలు

● మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ, నాట్కో, ఎంఎస్‌ఎన్‌ తదితర సంస్థలకు సమీపంలో 44వ జాతీయ రహదారికి చేరువలో ఉన్న ఇన్ముల్‌నెర్వాలో 18 నెలల్లో రోడ్లు, పారిశుద్ధ్యం, తాగునీరు, పార్కులు సదుపాయాలను కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 22న ప్రీబిడ్‌ సమావేశం నిర్వహించనున్నారు. స్థలాల కొనుగోలుకు సెప్టెంబర్‌ 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ 3న ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ నిర్వహిస్తారు.

బాచుపల్లి లేఅవుట్‌లో ప్రీ–బిడ్‌ సమావేశం

హెచ్‌ఎండీఏ బాచుపల్లి లేఅవుట్‌లోని 35 రెసిడెన్షియల్‌ ప్లాట్‌లకు గురువారం ప్రీబిడ్‌ సమావేశం నిర్వహించారు. హెచ్‌ఎండీఏ ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన డీఈఈ సత్య ప్రసాద్‌, ఎస్టేట్స్‌ విభాగం తహసీల్దార్‌ వైటీ వెంకటేశ్వర్లు, డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీకాంత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్‌ 1న ఈ స్థలాలకు బిడ్డింగ్‌ నిర్వహించనున్నారు. ఆసక్తిగలవారు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సామాన్య, మధ్యతరగతిని ఆకర్షిస్తున్న ఇన్ముల్‌నర్వ

హెచ్‌ఎండీఏ తక్కువ విస్తీర్ణం స్థలాల విక్రయం

152 నుంచి 300 గజాల వరకు 60 ప్లాట్లు

వచ్చే నెల 3న ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌కు ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement