శంకర్‌పల్లి: దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మాణమవుతుందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చొరవతో మండలంలోని జన్వాడలో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం రూ.5కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించిన అధునాతన ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాన్ని గురువారం స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఇండస్ స్కూల్ ఎండీ, సీఈఓ, మాజీ లెఫ్టినెంట్ జనరల్ అర్జున్ రాయ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేటీఆర్ దూరదృష్టి కలిగిన నాయకుడని, పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల కోసమే ఆలోచించే వ్యక్తి అని కొనియాడారు. విద్యార్థులు కష్టపడి చదివి జన్వాడని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. గతంలో మన ఊరు–మన బడి కింద జన్వాడ పాఠశాలకు రూ.2కోట్లు కేటాయించామని, టెక్నికల్ ఇష్యూ కారణంగా పనులు జరగలేదన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు బోధనలో మెలకువలు నేర్పేందుకు ఇండస్ స్కూల్ యాజమాన్యం సిద్ధంగా ఉందని, దాని కోసం ఇప్పటికే డీఈఓతో మాట్లాడానని తెలిపారు. ఇండస్ స్కూల్ యాజమాన్యం మూడు అధునాత హ్యూమనాయిడ్ రోబోలు, స్థానిక నాయకులు సైకిళ్లు అందించగా.. వాటిని విద్యార్థులకు అందించారు. దేశంలోని ప్రైవేటు పాఠశాలలు సామాజిక బాధ్యతతో వ్యవహరించి, తమ దగ్గరలోని ఏదో ఒక ప్రభుత్వ పాఠశాలని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని ఇండస్ స్కూల్ ఎండీ, సీఈఓ, మాజీ లెఫ్టినెంట్ జనరల్ అర్జున్ రాయ్ అన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. ప్రజలు అభివృద్ధిని చూసి మాత్రమే ఓట్లు వేయరని, మానవ సంబంధాలను చూసి వేస్తారని అన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ రవీందర్ రావు, జన్వాడ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దైవనందం రెడ్డి, ఇండస్ స్కూల్ ప్రిన్సిపాల్ ఫరీదా, శంకర్‌పల్లి పీఏసీఎస్ చైర్మన్ శశిధర్ రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోవర్థన్ రెడ్డి, మాజీ ఎంపీపీలు గోవర్థన్ రెడ్డి, నర్సింలు, నాయకులు వెంకట్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, వెంకటేశ్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి


