కందుకూరు: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు సామాన్య, మధ్య తరగతి ప్రజలపై పెను భారం మోపుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవీంద్రాచారి విమర్శించారు. సీపీఐ ఆధ్వర్యంలో మోదీ హటావో–దేశ్‌కో బచావో పేరుతో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర గురువారం మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో యువతకు ఉద్యోగాలు, రైతులకు గిట్టుబాటు ధర, కార్మికులకు భద్రత, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన ప్రభుత్వం, ఆ సమస్యలపై దృష్టి పెట్టకుండా ప్రజలను భావోద్వేగ అంశాలతో పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు. రైతులకు ఆదాయం పెంచుతామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్‌లో పేదలు, రైతులు, కార్మికులు, విద్యార్థులకు ప్రాధాన్యం కల్పించకుండా కార్పొరేట్ వర్గాల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. ప్రజా చైతన్య యాత్ర ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుని, వాటిపై పోరాటాలు చేసి పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి బి.దత్తునాయక్, సీపీఐ మండల కార్యదర్శి కొమ్మగళ్ల రాజు, బీకేఎంయూ జిల్లా కార్యదర్శి బద్దుల జంగయ్య, ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి ప్రభులింగం, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పి.శివకుమార్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి సామిడి వంశీవర్ధన్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పల్నాటి యాదయ్య, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు సుధాకర్ పాల్గొన్నారు.


