న్యూస్‌రీల్
చదువు చెప్పేదెవరు..
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం
శుక్రవారం శ్రీ 14 శ్రీ ఆగస్టు శ్రీ 2026
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఉమ్మడి జిల్లాలో అంతర్గత డిప్యూటేషన్ల దందా కొనసాగుతోంది. రాజకీయ పలుకుబడి ఉన్న కొంత మంది ఉపాధ్యాయులు అడ్డదారుల్లో పోస్టింగ్ పొందుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి రావడంతో పాటు పోస్టింగ్ పొందిన పాఠశాలలో కాకుండా సిటీకి సమీపంలో ఉన్న పాఠశాలల్లో పని చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 1,244 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 1.50 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్లు అంచనా. ఆయా పాఠశాలల్లో ఆరు వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిలో 500 మందికిపైగా పోస్టింగ్ పొందిన పాఠశాలలో కాకుండా నగరంలోని సొంత ఇంటికి సమీపంలోని పాఠశాలల్లో డిప్యూటేషన్లపై పని చేస్తున్నారు. జిల్లేడు చౌదరిగూడె జెడ్పీహెచ్‌ఎస్‌లో పోస్టింగ్ పొందిన గణిత సబ్జెక్ట్ టీచర్ మన్సూరాబాద్‌కు, ఇంగ్లిష్ టీచర్ మహేశ్వరం పాఠశాలకు, తెలుగు టీచర్ వనస్థలిపురం పాఠశాలకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. కొందుర్గు మండలం చెర్కుపల్లి దళితవాడ ప్రాథమిక పాఠశాలలో పోస్టిం గ్ పొందిన టీచర్ గండిపేట మండలం పీరం చెరువు పాఠశాలకు వెళ్లారు. పెద్దఎల్కిచర్ల పాఠశాలలో పోస్టింగ్ పొందిన టీచర్ శంకర్‌పల్లికి, రావిర్యాలలో పోస్టింగ్ పొందిన టీచర్ శేరిలింగంపల్లికి, చింతకుంటతండాలో పోస్టింగ్ పొందిన టీచర్ అబ్దుల్లాపూర్‌మెట్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఆయా సబ్జెక్టులను ఇతర సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధించాల్సి వస్తోంది. లక్ష్మీదేవునిపల్లెలో పోస్టింగ్ పొందిన టీచర్ ఆరుట్లకు, ఉత్తరాసిపల్లి ప్రాథమిక పాఠశాలలో పోస్టింగ్ పొందిన టీచర్ వయోజన విద్యావిభాగానికి, ఆగిర్యాల పాఠశాలలో పోస్టింగ్ పొందిన ఉపాధ్యాయుడు కలెక్టరేట్‌లోని డీఈఓ ఆఫీసుకు, మట్పూరు జెడ్పీహెచ్‌ఎస్‌లో పోస్టింగ్ పొందిన టీచర్ ఆరుట్లకు, ఉమ్మెంత్యాల పాఠశాలలో పోస్టింగ్ పొందిన టీచర్ చేవెళ్ల మండలం కమ్మెటకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. కేశంపేట మండలం వేముల్‌నర్వ జెడ్పీహెచ్‌ఎస్‌లో సోషల్, బయోసైన్స్ సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. కాకునూర్‌లో బయోసైన్స్ టీచర్ లేరు. విధి లేక ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. డిప్యూటేషన్లు రద్దు చేయాలని నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
వికారాబాద్‌లో 473 పోస్టులు ఖాళీ
వికారాబాద్ జిల్లాలో 1,026 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 4,660 ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. 4,187 మంది పని చేస్తున్నారు. మరో 473 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో కర్ణాటక సరిహద్దు గ్రామాల్లోని పాఠశాలల్లో పోస్టింగ్ పొందిన మెజార్టీ ఉపాధ్యాయులు స్థానికంగా ఉండటం లేదు. ఇప్పటికే సీఎంఓ మౌకిక ఆదేశాలతో వికారాబాద్, పరిగి, కొడంగల్ పట్టణాలకు సమీపంలో ఉన్న పాఠశాలలకు డిప్యూటేషన్లపై వెళ్లారు. మెజార్టీ పాఠశాలల్లో సింగిల్ టీచర్‌తో నెట్టుకొస్తున్నారు. అత్యవసర పని ఉండి ఉన్న ఒక్క ఉపాధ్యాయుడు సెలవులో వెళ్తే పాఠశాలకు సెలవు ప్రకటించాల్సిన దుస్థితి.
ఇది రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్తిమేడిపల్లి ప్రభుత్వ పాఠశాల. ఇక్కడ ఆరు నుంచి పది వరకు 261 మంది పిల్లలు చదువుతున్నారు. గతంలో బయోసైన్స్, ఫిజికల్ సైన్స్, మాథ్స్, ఇంగ్లిష్ ఉపాధ్యాయులు డిప్యూటేషన్‌పై వెళ్లారు. ప్రస్తుతం తెలుగు, సోషల్ టీచర్లు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు రెండు రోజుల క్రితం రోడ్డెక్కారు. కలెక్టర్ సహా స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే డీఈఓకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత్కాలికంగా ఇచ్చిన డిప్యూటేషన్లను రద్దు చేశారు.
మాది నిరుపేద కుటుంబం. ప్రైవేటు పాఠశాలలో చదివే స్థోమత లేక ప్రభుత్వ పాఠశాలలో చేరాను. ఇక్కడ పోస్టింగ్ పొందిన సబ్జెక్టు టీచర్లు కొద్ది రోజులకే ఒక్కొక్కరుగా మరో చోటికి వెళ్లిపోతున్నారు. అంతా వెళ్లిపోతే మాకు చదువెవరు చెబుతారు. డిప్యూటేషన్ ఆర్డర్లను తక్షణమే రద్దు చేయాలి.
– శ్రీవిద్య, పదో తరగతి, నక్కర్తమేడిపల్లి, యాచారం మండలం
విద్యార్థులకు పాఠాలు బోధించే వారు లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఇటీవల డీఈఓ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. ఉపాధ్యాయులను కేటాయిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఎవరూ రాలేదు. ఒక్కో టీచర్ రెండు తరగతుల విద్యార్థులను ఒకేచోట కూర్చోబెట్టి పాఠ్యాంశాలను బోధించాల్సి వస్తోంది.
– మీనాక్షి, సర్పంచ్, సంగెంకలాన్, తాండూరు మండలం
ఇది వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కర్ణాటక సరిహద్దు గ్రామం సంగెంకలాన్ ప్రాథమికోన్నత పాఠశాల. ప్రస్తుతం 107 మంది విద్యార్థులు చదువుతున్నారు. హెచ్‌ఎం సహా నలుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిలో ఒకరు డిసెంబర్ వరకు ప్రసూతి సెలవుల్లో ఉన్నారు. మరొకరు డిప్యూటేషన్‌పై దోమ మండలానికి వెళ్లారు. తాజాగా హెచ్‌ఎం లాంగ్ లీవ్ పెట్టి వెళ్లారు. ప్రస్తుతం ఇద్దరు ఉపాధ్యాయులతో నెట్టుకొస్తున్నారు. విద్యార్థుల నిష్పత్తి మేరకు టీచర్లు లేకపోవడంతో ఇటీవల తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు.


