యాచారం: జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లుపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సీరియస్ అయ్యారు. నక్కర్తమేడిపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై ఇతర పాఠశాలలకు పంపడానికి జిల్లా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయడం, గ్రామస్తులు బుధవారం పాఠశాల గేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేయడం తెలిసిందే. విషయాన్ని డీఈఓ దృష్టికి తీసుకెళ్లగా అవమానకరంగా మాట్లాడారు. గ్రామ సర్పంచ్ ముచ్చర్ల సుగుణ ఆధ్వర్యంలో గురువారం ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోటె శ్రీశైలం తొర్రూర్ క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యేకు తెలియజేశారు. దీంతో వెంటనే డీఈఓకు ఫోన్ చేసిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి జిల్లా అంటే నీ జాగీరనుకున్నావా.. నాకు తెలియకుండా నా నియోజకవర్గ ఉపాధ్యాయులను ఎలా బదిలీ, డిప్యూటేషన్‌పై పంపుతావని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోవాలా అంటూ మండిపడ్డారు. ఆ తర్వాత ఉపాధ్యాయుల డిప్యూటేషన్ రద్దు చేసినట్లు తెలిసింది.
డీఈఓపై ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సీరియస్


