కబ్జాకోరులపై చర్యలు తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

కబ్జాకోరులపై చర్యలు తీసుకోండి

Aug 15 2026 7:29 AM | Updated on Aug 15 2026 7:29 AM

లేదంటే సచివాలయాన్ని ముట్టడిస్తాం

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌

కాచిగూడ: భూకబ్జాదారులకు కొమ్ముకాస్తున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో సచివాలయాన్ని ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ హెచ్చరించారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో గురువారం బాధితులతో కలిసి మీడియాతో మాట్లాడారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తారామతిపేట సర్వేనంబర్‌ 36లో రెవెన్యూ అధికారుల సూచనలతో ప్రభుత్వ రికార్డుల ప్రకారం చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్‌తో ఓ బీసీ బిడ్డ భూమిని కొనుగోలు చేశారని, ఇటీవల ఆ భూమిపై అగ్రకులాలకు చెందిన భూకబ్జాదారుల కన్నుపడిందని అన్నారు. భూమి హద్దులు తొలగించి ప్రహరీ కూల్చివేసి కబ్జా చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. కొందరు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకుల అండతో ఆ భూమికి ఎలాంటి సంబంధం లేని రైతు సహకార సంఘం చైర్మన్‌ కొత్తపల్లి జైపాల్‌రెడ్డి, కరినే శాంతప్ప, వారి అనుచరులు కలిసి అర్ధరాత్రి హద్దులు, గోడలను తొలగించారని తెలిపారు. ఓఆర్‌ఆర్‌ కోసం 2005లో భూసేకరణ జరిగితే 21 ఏళ్ల తర్వాత ఆ భూమిని ఇప్పుడు రికార్డుల నుంచి తొలగించడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. 2005లోనే ఓఆర్‌ఆర్‌ కోసం భూసేకరణ జరిగి ఉంటే ఆ భూమిలో రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయని నిలదీశారు. ఈ విషయమై తహసీల్దార్‌ కబ్జాదారులకు కొమ్ముకాస్తున్నాడని ఆరోపించారు. దీనిపై హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. బీసీ నేతలు మాట్లాడుతూ.. బీసీల భూములు గుంజుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. బాధితులకు న్యాయం చేయాని కోరారు. సమావేశంలో భూమి విక్రయదారుడు నందనూరి కిరణ్‌ సాగర్‌, కొనుగొలుదారు చిలువేరు కిరణ్‌, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్‌కురుమ, గుజ్జ కృష్ణ, తాటికొండ విక్రమ్‌ గౌడ్‌, పిట్ల శ్రీధర్‌ వడ్డెర, పానగంటి విజయ్‌ గౌడ్‌, తంగెళ్లమూడి నందగోపాల్‌, గొడుగు మహేశ్‌, చందు, సుధీర్‌, వినోద్‌, కిరణ్‌ సాగర్‌, కిరణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement