పహాడీషరీఫ్: ఎదురుగా దూసుకొచ్చిన లారీ నుంచి తప్పించుకునే క్రమంలో అదుపుతప్పిన ఓ కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఇందులో ప్రయాణిస్తున్న ఇద్దరు సన్‌రూఫ్ గ్లాస్ ద్వారా బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. బహదూర్‌పురాకు చెందిన మహ్మద్ వసీం ఎంజీ హెక్టార్ కారు నడుపుతుండగా, స్నేహితుడు మహ్మద్ ముజఫర్ పక్క సీట్లో కూర్చున్నాడు. గురువారం తెల్లవారుజామున 4.30 గంటలకు డేసీ దాబా నుంచి జల్‌పల్లి కమాన్ వైపు వెళ్తుండగా పెద్దచెరువు కల్వర్టు వద్ద ఎదురుగా, వేగంగా వచ్చిన లారీని గమనించిన వసీం వాహనాన్ని రోడ్డు కిందికి దించి, ఎడమ వైపునకు కట్ చేశాడు. దీంతో కారు ముందు చక్రాలు నెమ్మదిగా రోడ్డును ఆనుకునే ఉన్న చెరువువైపు జారాయి. వాహనం చెరువులోకి దిగబడుతోందని అప్రమత్తమై సన్ రూఫ్ గ్లాస్ ద్వారా టాప్ పైకి ఎక్కి, బయటకు దూకారు. అంతలోనే కారు పూర్తిగా నీటిలోకి దిగిపోతుండడాన్ని తమ సెల్‌ఫోన్లలో వీడియో తీసుకున్నారు. డయల్ 100 కాల్ అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. చీకటిగా ఉండడంతో వాహనాన్ని బయటకు తీసేందుకు వీలుపడలేదు. వెలుతురు వచ్చాక పోలీసులు క్రేన్ తెచ్చేందుకు వెళ్లడంతో అటుగా వచ్చిన వాహనదారులు కారులో మనుషులు ఉన్నారేమోనని, వెనుక అద్దం పగులగొట్టి చూశారు. అంతలోనే పోలీసులు క్రేన్‌ను తీసుకొచ్చి బయటకు తీయించారు. ఈత రాని తాము దేవుడి దయతోనే బయటపడ్డామని యువకులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.
ఎదురుగా వచ్చిన లారీని తప్పించే క్రమంలో ప్రమాదం
సన్ రూఫ్ ద్వారా బయటకు వచ్చిన బాధితులు
క్రేన్ సాయంతో వాహనాన్ని తీయించిన పోలీసులు


