12,86,720 | - | Sakshi
Sakshi News home page

12,86,720

Aug 11 2026 7:15 AM | Updated on Aug 11 2026 7:15 AM

ఓటరు జాబితా నుంచి ఓట్లు తొలగించే అవకాశం

ఓటరు జాబితా నుంచి ఓట్లు తొలగించే అవకాశం

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్‌–2026)లో భాగంగా ఎన్యుమరేషన్‌ ఫారాల స్వీకరణ, కరెక్షన్‌, డిజిటలైజేషన్‌ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో మొత్తం 36,99,743 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 24,10,850 మంది (65.16 శాతం) మాత్రమే తమ ఎన్యూమరేషన్‌ పత్రాలను అందజేయగా, బీఎల్‌ఓలు వాటిని డిజిటలైజేషన్‌ చేశారు. మరో 12,86,720 (34.78 శాతం) మంది ఫారాలు సమర్పించలేదు. దీంతో వారి ఓట్లను జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది.

అత్యధికంగా

శేరిలింగంపల్లిలో..

అత్యధికంగా శేరిలింగంపల్లిలో 3,93,060 ఓట్లు, ఎల్బీనగర్‌లో 2,70,530, రాజేంద్రనగర్‌లో 2,47,244, మహేశ్వరంలో 2,35,714 ఓట్లు రద్దయినట్లు తెలిసింది. ఇబ్రహీంపట్నంలో 84,458, చేవెళ్లలో 55,610, కల్వకుర్తిలో 28,482, షాద్‌నగర్‌లో 35,317 ఓట్లు రద్దయ్యే అవకాశం ఉంది. మెజార్టీ ఓటర్లు ఒక చోట నుంచి మరో చోటికి వలస పోవడం.. అందుబాటులో ఉన్నవారు తమ ఓటును సొంతూళ్లకు బదిలీ చేయించుకోవడం.. చనిపోయిన వారు, డూప్లికేట్‌ ఓట్లు సైతం అదే స్థాయిలో ఉండటమే ఇందుకు కారణమని తెలిసింది.

పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ

ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ ఈ నెల 17న ఉంటుంది. అదే రోజు నుంచి సెప్టెంబర్‌ 16 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అక్టోబర్‌ 19న తుది ఓటరు జాబితా ప్రచురిస్తారు. ప్రస్తుతం ఉన్న ఓటర్ల సంఖ్య, భౌగోళిక పరిస్థితులు, ప్రజలకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపట్టనున్నారు.

పోలింగ్‌ కేంద్రాలపై దృష్టి

జిల్లాలో 3,501 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, వీటి పేరు మార్పు, స్థల మార్పు, కొత్త పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, పోలింగ్‌ కేంద్రాల విలీనం అనే నాలుగు అంశాలను ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది. ఓటర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండే ప్రత్యామ్నాయ భవనం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో నిబంధనలకు అనుగుణంగా పోలింగ్‌ కేంద్రాల స్థల మార్పునకు ప్రతిపాదనలు రూపొందిస్తుంది. నిర్దేశిత పరిమితికి మించి ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో కొత్త పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుపై పరిశీలన చేస్తుంది. గతంలో 1,400 మంది ఓటర్ల పరిమితి ఉండగా, ప్రస్తుతం అది 1,200కు తగ్గిన నేపథ్యంలో నిబంధనల ప్రకారం కొత్త పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తుంది. తగినంత ఓటర్ల సంఖ్య లేని పోలింగ్‌ కేంద్రాలను సమీపంలోని ఇతర పోలింగ్‌ కేంద్రాలతో విలీనం చేసే ప్రతిపాదనలను సైతం సిద్ధం చేసింది. గేటెడ్‌ కమ్యూనిటీలకు సమీపంలో లేదా నిబంధనలకు అనుగుణంగా పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తుంది.

ముగిసిన ఎన్యూమరేషన్‌ ఫారాల స్వీకరణ గడువు

జిల్లాలో నియోజకవర్గాలు: 8

మొత్తం ఓటర్ల సంఖ్య: 36,99,743

ఫారాలు సమర్పించింది : 24,10,850

డిజిటలైజేషన్‌ పూర్తి: 65.16%

ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ:

ఈనెల 17న

అభ్యంతరాల స్వీకరణ:

సెప్టెంబర్‌ 16 వరకు

తుది ఓటరు జాబితా ప్రచురణ:

అక్టోబర్‌

19న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement