శంకర్‌పల్లి: మండల పరిధిలోని చెందిప్పలో వెలసిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయాన్ని సోమవారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దంపతులు దర్శించుకున్నారు. ఆలయంలోని శివ లింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కుమార్ వారికి శేషవస్త్రం కప్పి, ఆలయ ఫొటోను బహూకరించారు.
షాబాద్: గ్రామాల్లో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని చేవెళ్ల ఏసీపీ కిషన్ పేర్కొన్నారు. మండల పరిధిలోని పెదవేడులో షాబాద్ సహకార సంఘం డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, సర్పంచ్ రాజసులోచన సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. గ్రామ రక్షణ కోసం బాధ్యతాయుతంగా వ్యవహరించి ముందుకు రావాలని కోరారు. సీసీ కెమెరాలతో ఇప్పటివరకు పలు కేసులు ఛేదించినట్లు తెలిపారు. ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో సీఐ డీకే లక్ష్మీరెడ్డి, సహకార సంఘం డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, సర్పంచ్ రాజ సులోచన, ఎస్‌ఐ చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
108 అంబులెన్స్‌లో ప్రసవంతల్లీబిడ్డలు క్షేమం
కడ్తాల్: మండల పరిధిలోని నేరెళ్లకోళ్లతండాకు చెందిన చెంచు లక్ష్మి (20)కి సోమవారం పురిటి నొప్పులు రావడంతో, కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. తండాకు చేరుకున్న సిబ్బంది గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో నొప్పులు తీవ్రం కావడంతో అంబులెన్స్‌లోనే ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డలను క్షేమంగా కల్వకుర్తి ఆస్పత్రిలో చేర్పించారు. సకాలంలో స్పందించి, ప్రసవం చేసిన సిబ్బందికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఖాతాదారుకు
తెలియకుండా నగదు బదిలీ
న్యాయం చేయాలని
పోలీసులకు ఫిర్యాదు
కొత్తూరు: ఖాతాదారుకు తెలియకుండానే అతడి అకౌంట్ నుంచి నగదు మరో ఖాతాకు బదిలీ అయింది. ఆలస్యంగా గుర్తించిన బాధితుడు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని ఇన్ముల్‌నర్వ గ్రామానికి చెందిన చెన్నయ్య గ్రామంలో హెయిర్‌కటింగ్ సెలూన్ నిర్వహిస్తున్నాడు. గత నెల 1న అతడి ఖాతా నుంచి రూ.98 వేలు మరో అకౌంట్‌కు బదిలీ అయ్యాయి. ఆలస్యంగా నగదు బదిలీ జరిగిన విషయాన్ని గుర్తించిన చెన్నయ్య సోమవారం పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


