నోటీసులేనా.. రికవరీనా! | - | Sakshi
Sakshi News home page

నోటీసులేనా.. రికవరీనా!

Aug 11 2026 7:15 AM | Updated on Aug 11 2026 7:15 AM

భూసేకరణలో ఆరోపణలు ఇవీ..

కొత్తూరు: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 2020లో మండలంలోని సిద్ధాపూర్‌లో టీజీఐఐసీకి కేటాయించిన భూసేకరణలో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆర్డీఓ, తహసీల్దార్ల తీరును నిరసిస్తూ అప్పట్లోనే రైతులు, ఆయా పార్టీలకు చెందిన నాయకులు కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టారు. అప్పటి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి భూ పరిహారం డబ్బులు దోచుకున్నారని ఆరోపించారు. షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ నేరుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి భూసేకరణలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని ఫిర్యాదు చేశారు. స్పందించిన రెవెన్యూ అధికారులు పారదర్శకంగా విచారణ జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ చివరిదశకు చేరడంతో అప్పటి అధికారులతో పాటు వారికి సహకరించిన ప్రజా ప్రతినిధులకు రికవరీ భయం పట్టుకుంది.

ఇదీ భూసేకరణ..

గత ప్రభుత్వం 2020లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు కోసం సిద్ధాపూర్‌లోని 252, 278, 361 సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు 330.34 ఎకరాలు సేకరించి టీజీఐఐసీకి బదలాయించింది. ఇందులో సుమారు 97.24 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా 160 ఎకరాలు అసైన్డ్‌, మిగతా 73.1 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. అప్పటి ప్రభుత్వం అసైన్డ్‌ రైతులకు ఎకరానికి రూ.10. 50 లక్షలు పరిహారంగా అందజేసింది.

నకిలీల గుర్తింపు పూర్తి

గత ఏడాది ఆగస్టులో రెవెన్యూ అధికారులు సిద్ధాపూర్‌ భూసేకరణ పరిహారంలో పలు ఆరోపణలు ఉన్న 80 మందికి నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న రైతులు మూడు రోజుల్లోగా తాము పరిహారం పొందిన పొలం, ఇతర వివరాలను రెవెన్యూ అధికారులకు వివరించాలని సూచించారు. రికార్డుల ఆధారంగా రైతులు చెప్పే వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అధికారులు పరిహారం పొందిన రైతు అర్హుడా..? అనర్హుడా..? అనే వివరాలు గుర్తించారు. నోటీసులు ఇచ్చి విచారణ పూర్తి చేసి అనర్హులుగా గుర్తించిన రైతుల నుంచి పరిహారం రికవరీ చేయడానికి జాబితా రూపొందించారు. ఒకవేళ పరిహారం పొందిన రైతులు తిరిగి ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వని పక్షంలో వారు పొందిన డబ్బులకు సమానమైన వారి ఆస్తిని సైతం అటాచ్‌మెంట్‌ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు. భూసేకరణలో సుమారు రూ.8 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారని సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వం సేకరించిన పొలాల్లో డంప్‌యార్డు ప్రతిపాదన రావడంతో నిధుల రికవరీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.

ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్ల కోసం సేకరించిన పొలాలు

సిద్ధాపూర్‌ భూసేకరణలో అవకతవకలు

భూ పరిహారం కాజేశారని అప్పట్లోనే ఆరోపణలు

అధికారుల తీరుపై ఆందోళనలు

ఆరోపణలు ఎదుర్కొన్న 80 మందికి నోటీసులు

పరిహారం రికవరీకి జాబితా రూపకల్పన

డంప్‌యార్డు ప్రతిపాదనతో విషయం పక్కదారి

ప్రభుత్వం ఫుడ్‌ ప్రాసెసింగ్‌కోసం సేకరించిన మొత్తం 330.34 ఎకరాల్లో కేవలం 150 నుంచి 160 ఎకరాల్లో అసైన్డ్‌ రైతులు ఉన్నారు.

ఈ విస్తీర్ణానికి మాత్రమే రైతులకు పరిహారం అందించాలి.

అధికారులు మాత్రం 240 ఎకరాలకు పరిహారం అందించినట్లు రికార్డుల్లో పేర్కొంటున్నారు.

వాస్తవంగా సుమారు 15 మంది అసైన్డ్‌ రైతులకు సాగు చేస్తున్న 25 ఎకరాలకు ఇప్పటికీ పరిహారం అందలేదు. వారు నేటికీ ఇదే పొలాల్లో సాగుచేస్తూ కబ్జాలో ఉన్నారు.

మరికొంత మంది రైతులకు రికార్డు ప్రకారం 3 ఎకరాలు ఉంటే ఎకరానికి మాత్రమే పరిహారం అందించినట్లు తెలుస్తోంది.

అసైన్డ్‌ పట్టాలు, కబ్జాలో లేని వారికి మాత్రం రెండు, మూడెకరాలకు సైతం పరిహారం అందినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అధికారుల తీరుతో నిజమైన అసైన్డ్‌ రైతులకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement