సమస్యలు పరిష్కరించాలి
కేశంపేట: పంచాయతీల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో మల్టీపర్పస్ వర్కర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. పరిశుభ్రత నిర్వహణ.. చెత్త సేకరణ.. డ్రైనేజీలు శుభ్రపరచడం.. తాగునీటి సరఫరా పర్యవేక్షణ.. మొక్కల సంరక్షణ.. ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి అనేక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గ్రామాల్లో అభివృద్ధి, పారిశుద్ధ్యానికి వెన్నెముకగా నిలుస్తున్న పంచాయతీ కార్మికులకు పెరుగుతున్న పనిభారానికి సమానంగా జీతాలు మాత్రం పెరగడం లేదు.
చాలీచాలని వేతనాలు
మల్టీపర్పస్ వర్కర్లకు ప్రభుత్వం నెలకు రూ.9,500 వేతనం అందిస్తోంది. కొన్ని గ్రామాల్లో కేటాయించి న ఒకటే పోస్టుకు ఇద్దరు లేదా ముగ్గురు పని చేస్తూ వచ్చే జీతం పంచుకుంటున్నారు. కుటుంబ పోషణ భారంగా మారిందని, పిల్లల విద్య, వైద్యం, నిత్యావసర వస్తువుల ఖర్చులు భరించడం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
24 గంటలు విధుల్లోనే..
గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించే కార్మికు లకు సమయపాలన లేకుండా పోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ, వాన, చలి తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. వీధుల పరిశుభ్రత, చెత్త తరలింపు, మురికి కాలువలను శుభ్రం చేయడం, దోమల నివారణ చర్యలు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ చేపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో సాధారణ విధులకు మించి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రోజువారీ పనులతో పాటు ప్రత్యేక దినోత్సవాలు, గ్రామసభలు, ప్రజా ఆరోగ్య కార్యక్రమాలు, స్వచ్ఛత, అవగాహన కార్యక్రమాలు, ర్యాలీల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
సేవలకు గుర్తింపేది?
మల్టీపర్పస్ వర్కర్లకు రోజురోజుకూ బాధ్యతలు పెరుగుతున్నా జీతాలు పెరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ సేవలకు తగిన గుర్తింపు, గౌరవం, ఆర్థికభద్రత లేవని వాపోతున్నారు.
అసెంబ్లీలో ప్రకటించినా..
పంచాయతీ కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.9,500 వేతనం రూ.16వేలకు పెంచుతున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు. అయినా నేటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఉద్యోగ భద్రతతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం లేవు. కార్మిక చట్టాల ప్రకారం పనికి తగిన వేతనం అందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులు
పరిశుభ్రతలో పంచాయతీ కార్మికుల కీలకపాత్ర
పెరుగుతున్న పని భారం.. అందని కనీస వేతనం
కుటుంబ పోషణ కష్టం అవుతోందని ఆందోళన
హామీలు అమలు చేసి,
ఆదుకోవాలని విజ్ఞప్తి
కేశంపేట: పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్స్‌ను కార్మికులుగా గుర్తించి, రూ.26వేల చొప్పున కనీస వేతనం అందించాలని పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు టంగుటూరి నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పంచాయతీ వర్కర్స్ జిల్లా 3వ మహాసభకు ఆయనతో పాటు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి యాదయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు. మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జీపీ కార్మికులకు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వమని చెప్పుకొనే వారికి కార్మికుల సమస్యలు కన్పించడం లేదా అని ప్రశ్నించారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని, రూ.10లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, బూట్లు, చేతులకు గ్లౌజులు, నూనె, సబ్బులు అందించాలన్నారు. వారాంతపు సెలవులతో పాటు పండుగ దినాల్లో వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలన్నారు. వెంటనే గుర్తింపుకార్డులు అందించాలని, ప్రస్తుత జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు, తెలంగాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనపల్లి జైపాల్‌రెడ్డి, జీపీ వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆగిరాల రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.


