సంచలనాలకు అడ్డా | - | Sakshi
Sakshi News home page

సంచలనాలకు అడ్డా

Jul 15 2026 12:05 PM | Updated on Jul 15 2026 12:05 PM

కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన షాద్‌నగర్‌

● నాటి నుంచి నేటి దాకా ఎన్నో ఘటనలు

● దిశ హత్య, నిందితుల ఎన్‌కౌంటర్‌ ఇక్కడే

● గ్యాంగ్‌స్టర్‌ నయూం ఎన్‌కౌంటర్‌ సైతం

● తాజాగా రాజ్‌కుమార్‌ ఆత్మహత్య ఉదంతం

షాద్‌నగర్‌: సంచలనాలకు షాద్‌నగర్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఏదో ఒక సంఘటన ఈ ప్రాంతాన్ని కుదిపేస్తూనే ఉంది. దిశ హత్య.. నిందితుల ఎన్‌కౌంటర్‌.. గ్యాంగ్‌స్టర్‌ నయూం ఎన్‌కౌంటర్‌.. తాజాగా సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య నిందితుడు రాజ్‌కుమార్‌ బలవన్మరణం ఇలా ఎన్నో ఘటనలు కలకలం రేపాయి.

నాటి ఘటనలు

స్వాతంత్య్ర పోరాట యోధుడు తుర్రెబాజ్‌ఖాన్‌ బ్రిటీష్‌ దొరల నుంచి తప్పించుకొని ఫరూఖ్‌నగర్‌ మండలం మొగిలిగిద్ద గ్రామంలో తలదాచుకున్నాడు. ఇక్కడికి వచ్చిన అతన్ని చుట్టుముట్టి హైదరాబాద్‌ తీసుకెళ్లి బ్రిటీష్‌ వాళ్లు కోఠి వద్ద అతడిని ఉరి తీసినట్లు చెబుతుంటారు.

నిజాం పాలనలో రజాకార్లను తరిమికొట్టే క్రమంలో ఇక్కడ బాంబులు వేశారు.

1949లో ప్రస్తుత ఏసీపీ కార్యాలయం, ఫరూఖ్‌నగర్‌లోని ఆజం అలీఖాన్‌తోట, పట్టణ కూడలిలో మూడు బాంబులు వేసి పోలీసు సైన్యం రజాకార్లను చంపేసింది. అప్పట్లో ఇది సంచలనంగా మారింది.

1990 డిసెంబర్‌ 5న షాద్‌నగర్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన గోపాల్‌రెడ్డి, శంకర్‌రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్‌ నుంచి కడప వెళ్తున్న ఆర్టీసీ బస్సు షాద్‌నగర్‌ బస్టాండ్‌లో ఆగినప్పుడు తినుబండారాలు కొనుగోలు చేసేందుకు దిగిన గోపాల్‌రెడ్డి, శంకర్‌రెడ్డిని 12 మంది ప్రత్యర్థులు వేట కొడవళ్లతో అతిదారుణంగా హతమార్చారు.

2004లో షాద్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలోని బాలానగర్‌లో కానిస్టేబుల్‌ ప్రకాష్‌ను మావోయిస్టులు హతమార్చారు. ఆయా ఘటనలతో అప్పట్లో షాద్‌నగర్‌ అట్టుడికింది.

హత్యలు, ఎన్‌కౌంటర్లు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్‌, డాన్‌గా ఎదిగిన నయీం షాద్‌నగర్‌ పట్టణ శివారులోని మిలీనియం టౌన్‌షిప్‌లో తలదాచుకున్న విషయం ఎవరికీ తెలియదు. 2016 ఆగస్టు 8న ఆచూకీ తెలుసుకున్న పోలీసులు నయీం ఇంటిని చుట్టు ముట్టి ఎన్‌కౌంటర్‌ చేశారు. గ్యాంగ్‌స్టర్‌గా పేరు పొంది అప్పటి ప్రభుత్వానికే సవాల్‌గా మారిన నయీంను పోలీసులు ఇక్కడే హతమార్చారు.

2019 నవంబర్‌లో షాద్‌నగర్‌ శివారులోని చటాన్‌పల్లి వద్ద దిశను అత్యంత దారుణంగా నలుగురు వ్యక్తులు హతమార్చారు. దిశను హత్య చేసిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే ఆమె హత్యకు కారణమైన నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఈ సంఘటన అప్పట్లో సంచలనం రేపింది.

తాజాగా షాబాద్‌ నరహంతకుడు రాజ్‌కుమార్‌ సైతం కొత్తూరు మండలం పెంజర్ల గ్రామం వద్ద ఆత్మహత్య చేసుకోవడం మరోసారి సంచలనం సృష్టించింది. షాద్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న వరుస సంఘటనలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement