డబుల్ బెడ్రూం లబ్ధిదారుల ఆందోళన
ఇబ్రహీంపట్నం రూరల్: డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట మంగళవారం మాంకాల్‌కు చెందిన డబుల్‌బెడ్రూం లబ్ధిదారులు ధర్నా చేపట్టారు. తమ పట్టాలు తమకు ఇచ్చే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో కందుకూరు ఆర్డీఓ, సరూర్‌నగర్ మండల అధికారులు చేపట్టిన విచారణలో 141 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారన్నారు. ఇప్పటికే వీరిలో ముగ్గురు చనిపోగా, 9 మంది అనర్హులుగా మరో 9 మంది సరూర్‌నగర్ మండలంలో లేరని నిర్ధారించారని తెలిపారు. జిల్లాకు చెందిన 1,730 మంది లబ్ధిదారులకు ఎలాంటి విచారణ లేకుండా రీ అలాట్‌మెంట్ చేశారని వాపోయారు. నాలుగేళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగి అలిసిపోతున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే న్యాయం చేయాలని కోరారు. పట్టాలు మంజూరు చేసే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


