తుర్కయంజాల్: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఇంజాపూర్‌లోని ప్రభుత్వ సర్వే నంబర్ 126లోని 74.16 ఎకరాల భూమి ఆక్రమణలపై సోమవారం రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. భూముల ఆక్రమణలపై సీబీసీఐడీతో దర్యాప్తు చేయించడంతో పాటు మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని డీజీపీని ఆదేశించడంతో అధికారుల్లో కదలిక వచ్చింది. తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, మండల సర్వేయర్ శ్రీనివాస్, ఆర్‌ఐ ప్రేమ్‌కుమార్ మంగళవారం సర్వే నంబర్‌లోని మొత్తం భూమిని సర్వే చేశారు. హద్దులను ఏర్పాటు చేయడంతో పాటు మొత్తం భూమిలో కబ్జాలను నమోదు చేసుకున్నారు.
అధికారుల లెక్కల ప్రకారం..
22 ఎకరాలను హుడాకు కేటాయించారు. 16 గుంటల భూమిలో సబ్‌స్టేషన్ నిర్మాణం, 5.19 ఎకరాల్లో ఇందిరమ్మ కాలనీ, 4.26 గుంటల్లో శ్మశానవాటిక, 1.30 ఎకరాల్లో పలు దేవాలయాలు, 3.07 ఎకరాల్లో ఇంజాపూర్ నుంచి తొర్రూర్ వెళ్లే రోడ్డు, ఇతర రోడ్లు, 10.01 ఎకరాల్లో బీఆర్‌ఎస్ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. 35 గుంటల భూమిలో గౌడ సంఘం భవనం, ఎకరంలో దోబీ ఘాట్, 7.25 ఎకరాల్లో పలువురు రైతులు వ్యవసాయం చేస్తున్నారు. 1.12 ఎకరాలు మాసబ్ చెరువు నుంచి దిలావర్‌ఖాన్ చెరువుకు నీరు వచ్చే కాలువ, 1.19 ఎకరాల్లో కబ్జా చేసి ప్రహరీ నిర్మించినట్లు, 39 గుంటల భూమిలో గోదాములు, 6 గుంటల భూమిలో షెడ్లు, 3 గుంటల భూమిలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, 7.8 ఎకరాల భూమిలో ఇళ్ల నిర్మాణాలు, చెరువు, 1.13 ఎకరాల్లో అపిల్ అవెన్యూ కాలనీ కమ్యూనిటీ హాల్‌తో పాటు పలు నిర్మాణాలు, 1.36 ఎకరాల్లో రెడ్డి భవనం, గుడి, పలు ఇళ్లు, 3.01 ఎకరాల్లో ఇళ్లు, షెడ్లు ఉన్నట్లు గుర్తించి హైకోర్టుకు నివేదించిన విషయం తెలిసిందే.
ఆక్రమణల పర్వం సాగిందిలా..
● ఇంజాపూర్‌లోని అపిల్ అవెన్యూ కాలనీలోని కొన్ని ఇళ్ల నిర్మాణాలు, కమ్యూనిటీ హాల్‌లో కొంత భాగం 126 సర్వే నంబర్‌లోనే ఉన్నట్లు అధికారులు గతంలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సర్వే చేసి 2018లోనే నిర్దారించారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మేరకు దాన్ని అలానే వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే వెంచర్‌లో మాసబ్ చెరువు నుంచి దిలావర్‌ఖాన్ చెరువుకు నీరు వచ్చే వాగును కొంత మేర కబ్జా చేయడంతో పాటు ఓ అపార్ట్‌మెంట్ నిర్మాణం చేపట్టారు.
● 5.19 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఇందిరమ్మ కాలనీ పేరుతో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు. 2020 సంవత్సరం వరకు అప్పటి ప్రజాప్రతినిధి ఇష్టానుసారంగా సంతకాలు పెట్టి సర్టిఫికెట్లు జారీచేశారు. దీనికి గాను రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశారనే ఆరోపణలు వినిపించాయి.
● 126 సర్వే నంబర్‌కు చుట్టూ పక్కల వెలసిన వెంచర్ల నిర్వాహకులు అధికారుల అండదండలతో యథేచ్ఛగా ప్రభుత్వ భూమిని కలుపుకొని ప్లాట్లు చేసి విక్రయించారు. దీంతో ప్రస్తుతం చాలా ఇళ్లు, ఓపెన్ ప్లాట్లు ప్రభుత్వ భూమిలో ఉన్నట్లు గుర్తించారు.
బహిరంగ మార్కెట్‌లో..
సాగర్ రహదారికి కూతవేటు దూరంలో ఉన్న 126 సర్వే నంబర్‌లోని భూమి విలువ బహిరంగ మార్కెట్ ప్రకారం రూ.10 కోట్ల పైమాటే. ఇంత విలువైన ప్రభుత్వ భూమి దర్జాగా కబ్జాకు గురువుతున్నా ఇరవై ఏళ్లుగా ఇక్కడ పనిచేసిన రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. గడిచిన 15 ఏళ్ల కాలంలోనే ఆక్రమణల పర్వం కొనసాగింది. ఇంత ఖరీదైన భూమిని రక్షించే విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. విషయం ఆలస్యంగా అయినా హైకోర్టుకు చేరడంతో అక్రమాలకు పాల్పడ్డ రాజకీయ నాయకులతో పాటు, సహకరించిన అధికారుల్లోనూ భయం మొదలైంది.
ఇంజాపూర్ సర్వేనంబర్ 126లోని ఆక్రమణలపై సర్వే
ఇరవై ఏళ్లుగా కొనసాగిన కబ్జాల పర్వం
పట్టించుకోని అధికార యంత్రాంగం
హైకోర్టు ఆదేశాలతో అక్రమార్కుల్లో భయం


