హుడాకాంప్లెక్స్: ‘యూత్ డిక్లరేషన్’ పేరిట ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ నేతలు విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనెల 18న సరూర్‌నగర్ స్టేడియం వేదికగా నిర్వహించనున్న ‘బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సు’ స్థలాన్ని మంగళవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సదస్సుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నట్టు తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంబీర్‌పూర్ రాజు, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, నోముల భగత్, బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ వీరమళ్ల రామ్ నర్సింహ గౌడ్, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.


