● రట్టు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్
● తొమ్మిది మందిపై కేసులు నమోదు
ఇబ్రహీంపట్నం రూరల్: అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యం నిల్వలపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అర్ధరాత్రి దాడులు చేసి పట్టుకున్నారు. తెలంగాణలో సేకరించి గుజరాత్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు తరలిస్తుండగా అప్రమత్తమైన అధికారులు గుట్టు రట్టు చేశారు. ఈ సంఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సీఐ అజయ్‌బాబు కథనం ప్రకారం.. ఆదిభట్ల సమీపంలోని టాటా ఏరోస్పేస్ సెజ్‌లోని మారుతి ఇండస్ట్రియల్ పార్కు గోదాంలో అక్రమంగా పీడీఎస్ బియ్యం నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో సివిల్ సప్లయ్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ అజయ్‌బాబు బృందం, సివిల్ సప్లయ్ డీటీ నర్సింహారెడ్డి, ఆదిభట్ల పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఓ లారీ నిండా 524 బ్యాగుల్లో నింపిన 360 క్వింటాళ్ల బియ్యం, మరో లారీలో 65 బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. గోదాంలో 330 బ్యాగుల్లో నిల్వ చేసిన 15 క్వింటాళ్ల గోధుమలను స్వాధీనం చేసుకుని ఆదిభట్ల పోలీసులకు అప్పగించారు. కందుల అఖిల్ కుమార్ నుంచి మోహినుద్దీన్ గోదాం లీజుకి తీసుకున్నట్లు తెలిపారు. మజారుద్దీన్, ఫిరోజ్, అర్జున్, రాహుల్, అక్రమ్ కలిసి అక్రమంగా దందా నడిపిస్తున్నట్లు చెప్పారు. మొత్తం తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు.
1,500 కిలోల బియ్యం పట్టివేత
శంకర్‌పల్లి: అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వివరాలివీ.. పేదల నుంచి అక్రమంగా కొనుగోలు చేసిన రేషన్ బియ్యం మున్సిపల్ పరిధిలోని బుల్కాపూర్ వద్ద నిల్వ ఉంచినట్లు స్థానిక పోలీసులకు పక్కా సమాచారం అందింది. వెంటనే అక్కడికి వెళ్లి తనిఖీలు చేపట్టగా 30 కిలోల బరువుతో ఉన్న 50 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. నిల్వ ఉంచిన వ్యక్తి జహంగీర్, యజమాని మహబూబ్‌పై కేసు నమోదు చేశారు. బియ్యాన్ని సీజ్ చేసి, చేవెళ్ల పౌర సరఫరాల కేంద్రానికి తరలించినట్లు ఎస్‌ఐ మంజుల తెలిపారు.


